గత కొంత కాలంగా శ్వాస సంబంధిత ఇబ్బందులు పడుతున్న ప్రముఖ బాలీవుడ్ గాయని లతా మంగేష్కర్ పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. 90 ఏళ్ల లతా మంగేష్కర్ ప్రస్తుతం న్యుమోనియాతో బాధపడుతుండటంతో సోమవారం ముంబైలో బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. ఆమెకు డాక్టర్ పతీత్ సంధానీ నేతృత్వంలోని వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది. ప్రస్తుతం ఆమెకు యాంటీబయాటిక్స్ అందిస్తున్నామనీ.. ఇన్ఫెక్షన్ అదుపులోకి వచ్చిన తరువాతనే వైద్య ప్రక్రియ ముందుకు వెళుతుందని, అయితే డాక్టర్ సంధానీ పేర్కొన్నారు. ఆమె ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉందని చెప్పారు. కాగా లతా మంగేష్కర్ ఆరోగ్యం విషమించిందన్న వార్తలతో యావత్ భారతావని ఆందోళన చెందుతోంది. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు, బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు. ఆమె అభిమానులు పలు దేవాలయాలలో, మసీదులలో, చర్చిలలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహిస్తుండటం విశేషం.