ఒక వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు వైవిధ్యమైన పాత్రల్లోనూ నటించేందుకు నిర్ణయం తీసుకున్న అల్లరి నరేష్ ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన `మహర్షి` చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. మరో వైపు తనదైన మార్క్ కామెడీ మూవీ `బంగారు బుల్లోడు` సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకున్న సమయంలో అల్లరి నరేష్ కథానాయకుడిగా ఓ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ త్వరలో ప్రారంభం కానుంది. ఆ మూవీకి హరీశ్ శంకర్ దగ్గర కో డైరెక్టర్‌గా పనిచేసి న విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అలాగే `మోసగాళ్లకు మోసగాడు`, `ఒక్క క్షణం` చిత్రాలకు కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన సతీశ్ వేగేశ్న తొలిసారి నిర్మాతగా మారి ఆరంభించిన ఎస్వీ2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్నినిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటిస్తామని చిత్ర యూనిట్ వర్గాలు చెపుతున్నాయి.