ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దక్షిణాది హీరోయిన్లను వణికిస్తున్న ఒవియా

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 19, 2018, 12:23 PM



ఇటీవల విడుదలైన తరుణ్ సినిమా ‘ఇది నా లవ్ స్టోరీ’ గుర్తుందా? అందులో తరుణ్‌ సరసన నటించిన హీరోయిన్ ఒవియాకు తమిళనాడులో మాంచి ఫాలోయింగ్ ఉంది. దురదృష్టవశాత్తు తొలి తెలుగు చిత్రం ‘ఇది నా లవ్ స్టోరీ’ హిట్ కాకపోవడంతో ఆమె మళ్లీ కోలీవుడ్‌కు వెళ్లిపోయింది. అయితే, దక్షిణాదిలో ఇప్పుడు ఆమె పేరు మారుమోగుతోంది. దక్షిణాదిలోని అగ్ర హీరోయిన్లకు సైతం చెమటలు పట్టిస్తోంది.


చెన్నై టైమ్స్ నిర్వహించిన ‘మోస్ట్ డిజరిబుల్ హీరోయిన్ 2017’ పోల్‌లో ఒవియా అగ్రస్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె క్రేజ్ ముందు.. ఎప్పుడూ అగ్రస్థానంలో ఉండే నయనతార రెండో స్థానంతో సరిపెట్టుకోక తప్పలేదు. చిత్రం ఏమిటంటే ఒవియా ఇప్పటివరకు చేసిన సినిమాలు పాతిక మించవు. వాటిలో హిట్లు కూడా తక్కువే. అయితే, తమిళనాడులో మాత్రం ఆమెకు భలే క్రేజ్ ఉంది.


కేరళాకు చెందిన ఒవియా ‘కలవాణి’ సినిమాతో తమిళ పరిశ్రమకు పరిచయమైంది. కొన్నాళ్లు ఆమెకు అక్కడ మంచి క్రేజ్ లభించినా.. ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోయాయి. తట్ట బుట్ట సద్దుకుంటున్న సమయంలో ‘ఇది నా ప్రేమ కథ’లో అవకాశం వచ్చింది. టాలీవుడ్‌లో అవకాశాలు వస్తాయని ఆశించింది. అయితే, ఆ సినిమా విడుదల కాకుండా వాయిదాలు పడుతూ వస్తుండటంతో ఒవియా.. ఆశలు వదిలేసుకుంది. ఆ సమయంలోనే తమిళ ‘బిగ్‌బాస్’ రియాల్టీ షోలో ఆమెకు ఛాన్స్ వచ్చింది.దీంతో ఒక్కసారిగా ఒవియాకు క్రేజ్ పెరిగిపోయింది. పలు వివాదాలు, లవ్‌స్టోరీలతో ఆమె ‘బిగ్‌బాస్’ను రక్తికట్టించింది. ఆ క్రేజే ఇప్పుడు ఆమెను దక్షిణాది టాప్ హీరోయిన్లలో అగ్రస్థానంలో నిలిపింది. నయన్ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ 3, శ్రద్ధా 4, కాజల్ అగర్వాల్ 5వ స్థానంలో ఉన్నారు. గతేడాది 13, 16 స్థానాల్లో ఉన్న అమలాపాల్, హన్సికలు 28, 30 స్థానలకు పడిపోయారు. ఈ క్రేజ్ మళ్లీ ఆమెకు అవకాశాలు తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com