బాలీవుడ్ నటి మలైకా అరోరా ఖాన్..మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ గురించి షాకింగ్ వివరాలు వెల్లడించారు. నమ్రత సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ రంగంలో ఉండేవారు. అదే సమయంలో మలైకా కూడా మోడలింగ్ పరిశ్రమలోకి వచ్చారు.అయితే తాను పరిశ్రమకు వచ్చిన కొత్తలో నమ్రత, ఆమె స్నేహితురాలు మెహర్ జెస్సియా తనతో దురుసుగా ప్రవర్తించేవారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని మలైకా ‘వోగ్ బీఎఫ్ఎఫ్’ అనే కార్యక్రమంలో వెల్లడించారు. ఈ కార్యక్రమానికి మలైకా తన సోదరి అమృతతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘నేను మోడలింగ్ పరిశ్రమలో ఉన్నప్పుడు నమ్రత, మెహర్ జెస్సియా నాకు సీనియర్లు. అప్పటికే వారు మంచి మోడళ్లుగా పేరు తెచ్చుకున్నారు. దాంతో కొత్తగా వచ్చినవారితో పొగరుగా ప్రవర్తిస్తూ సీనియారిటీ ప్రదర్శించేవారు. అయితే ఇప్పుడు వారిద్దరూ నాతో స్నేహపూర్వకంగా ఉంటున్నారు.’ అని చెప్పుకొచ్చారు మలైకా.
సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ను వివాహం చేసుకున్నారు మలైకా. కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం మలైకా టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ, అప్పుడప్పుడూ ప్రత్యేక గీతాల్లో మెరుస్తున్నారు.