ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రా..రా మూవీ రివ్యూ

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 23, 2018, 03:32 PM



నటుడు శ్రీకాంత్‌ ఫ్యామిలీ హీరోగా ఒకప్పుడు వెండితెరపై సందడి చేశారు. ఆయన తొలిసారి నటించిన హారర్‌ కామెడీ చిత్రం ‘రా..రా’. ‘యుద్ధం శరణం’ తర్వాత ఆయన నటించిన చిత్రమిది. ఇందులో శ్రీకాంత్‌ దర్శకుడిగా కనిపించారు. ఇప్పటి వరకు దెయ్యాలు మనుషుల్ని భయపెట్టడాన్ని తెరపై చూశాం. ‘ఆనందోబ్రహ్మ’ సినిమాతో మనుషుల్ని చూసి దెయ్యాలు భయపడే కొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేశారు. వినోదబరితంగా రూపొందించిన ఆ సినిమాకు మంచి స్పందన లభించింది. ఇప్పుడు ఇదే కోణంలో ‘రా..రా’ తెరకెక్కింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా?చాలా రోజుల తర్వాత హీరోగా నటించిన శ్రీకాంత్‌ మెప్పించారా?


కథేంటంటే?: దర్శకుడు రాజ్‌కిరణ్‌ (శ్రీకాంత్‌) మూడు సినిమాలు తీస్తాడు. ఆ మూడు సినిమాలు అపజయం పొందుతాయి. మూడో సినిమా తీసే సమయంలో తల్లికి గుండెపోటు వస్తుంది. ఓ హిట్‌ సినిమా తీసి తల్లి ప్రాణాలు కాపాడుకోవాలన్న ఆశయంతో నాలుగో సినిమాకు శ్రీకారం చుడతాడు. ఈసారి దెయ్యం కథ ఎంచుకుంటాడు. అందుకోసం ఊరి చివర ఉన్న పురాతనమైన బంగ్లాలో మకాం పెడతాడు. అక్కడే కథ రాసుకుని, అక్కడే షూటింగ్‌ పూర్తిచేసి బయటికి రావాలి అనుకుంటాడు. అయితే ఆ బంగ్లాలో కొన్ని ఆత్మలు తిరుగుతుంటాయి. అందులోకి ప్రవేశించిన వారెవ్వరినీ బయటికి పంపవు. రాజ్‌కిరణ్‌ను, అతడి బృందాన్ని ఆ ఇంట్లోనే బందీలుగా ఉంచుతాయి. మరి రాజ్‌కిరణ్‌ సినిమా తీయగలిగాడా?బయటికి రాగలిగాడా? అన్నదే కథ.


ఎలాఉందంటే: మనుషులు దెయ్యాల్ని భయపెట్టడం పాయింట్‌తో ఈ సినిమా సాగుతుంది. అయితే ఆ కొత్త పాయింట్‌ను దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేదు అనిపిస్తుంది. మనుషుల్ని చూసి దెయ్యాలు భయపడే సన్నివేశాల్ని వినోదభరితంగా తీర్చిదిద్దాల్సింది పోయి, వెటకారంగా మలిచారు. దాంతో ఏ సన్నివేశం కూడా తెరపై పండలేదు. లెక్కలేనంత మంది నటులు ఉన్నప్పటికీ సన్నివేశ రూపకల్పనలో బలం లేకపోవడంతో వాళ్లంతా తేలిపోయారు. మధ్యలో పృథ్వీ వచ్చి కాస్తంత ఉపశమనం కలిగిస్తాడు. తొలిసగంలో కథేమీ సాగదు. కేవలం సన్నివేశాల్ని అతికించుకుంటూ వెళ్లిపోయారంతే. ద్వితీయార్ధంలో రెండో దెయ్యం గ్యాంగ్‌ ప్రవేశిస్తుంది. అక్కడి నుంచైనా కథ మలుపు తిరగాల్సి ఉంది. దెయ్యం ఫ్లాష్‌బ్యాక్‌, ఆ తర్వాత దెయ్యాలతో తీసిన సినిమా.. ఇవన్నీ కృతకంగా కనిపిస్తాయి. దెయ్యాలతో సినిమా తీయడం అనే పాయింట్‌ బాగున్నా అప్పటికే నీరసమైన సన్నివేశాలు చూసి ప్రేక్షకుడికి విసుగు వస్తుంది. అటు వినోదం, ఇటు హారర్‌ ఎలిమెంట్స్‌ రెండూ తెలిపోవడంతో ‘రా..రా’ దీనికి న్యాయం చేయలేకపోయింది. హాస్యనటులు ఎక్కువ మంది ఉండటం, శ్రీకాంత్‌ లాంటి కథానాయకుడు తొలిసారి హారర్‌ సినిమా తీయడం మాత్రమే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ.


రివ్యూ : 2.5/5






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com