ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింగర్ చిత్రకి పద్మభూషణ్ పురస్కారం..

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 26, 2021, 12:46 PM



ప్రముఖ లెజెండరీ సింగర్ చిత్రకి అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం దక్కింది. కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో చిత్రని పద్మభూషణ్ పురస్కారం వరించింది. దేశంలో మూడో అత్యున్నత పురస్కారం అయిన పద్మభూషణ్ అవార్డు చిత్రకి వరించడంతో అటు సినీ పరిశ్రమతోపాటు ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే గాయని చిత్ర 1963లో జూలై 27న కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు. మాతృభాష మలయాళంలో గాయనిగా గుర్తింపు పొందిన చిత్ర ఆ తర్వాత ఇళయరాజా సంగీతంలో యావత్ దక్షిణాదినీ అలరించింది.
1986లో 'సింధుభైరవి' తమిళ చిత్రం ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తమగాయనిగా అవార్డు దక్కించుకున్నారు. ఆ తరువాత వరుసగా మళయాళ చిత్రం 'నఖశతంగల్', హిందీ చిత్రం 'విరాసత్' ద్వారానూ గాయనిగా జాతీయ స్థాయిలో అవార్డులు అందుకొని 'హ్యాట్రిక్' సాధించారు. ఇప్పటి వరకు ఆరు సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డులను చిత్ర అందుకున్నారు. మూడు దశాబ్దాల కాలంలో ఆమె ఇరవై వేలకు పైగా పాటలు పాడారు. ప్రొఫెసర్ ఒమన్ కుట్టి ప్రోత్సాహంతో చిత్ర 'అట్టహాసం' చిత్రంలో నేపథ్య గానం ఆలపించారు.
ఆ తర్వాత ఏసుదాసు ట్రూప్ చేరి ఎన్నో కచేరీలలో పాల్గొన్నారు. 1982 నుండి నేపథ్య గాయనిగా చక్కని గుర్తింపు పొందిన చిత్ర ఆ తర్వాత రెండేళ్ళకే తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఇకపోతే టాలీవుడ్ లో 'సీతారామయ్యగారి మనవరాలు' చిత్రం కోసం చిత్ర పాడిన 'పూసింది పూసింది పున్నాగ' గీతం సూపర్ హిట్ కావడంతో ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత 'కొండవీటి దొంగ' చిత్రం కోసం చిత్ర ఆలపించిన 'శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో' పాట ఆమెలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది.
1990 నుండి వరుసగా నాలుగేళ్ళ పాటు ఉత్తమ గాయనిగా నంది అవార్డులను సొంతం చేసుకున్నారు. 'మాతృదేవోభవ, సుందరకాండ, భైరవద్వీపం, శుభసంకల్పం, బొంబాయి ప్రియుడు చిత్రాలు ఆమెకు నంది పురస్కారాలను అందచేశాయి. 'జగదేకవీరుడు అతిలోక సుందరి, మేజర్ చంద్రకాంత్, రాజా' వంటి చిత్రాలలో చిత్ర పాటలను అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఇక రెండువేల సంవత్సరం తర్వాత కూడా 'స్వయంవరం, వర్షం, కలవరమాయే మదిలో' చిత్రాలకు గానూ చిత్ర ఉత్తమ గాయనిగా నంది పురస్కారం అందుకున్నారు.
1985 నుండి 14 సంవత్సరాల పాటు కేరళ ప్రభుత్వం నుండి ఉత్తమ గాయనిగా అవార్డులు అందుకున్న ఘనత చిత్ర సొంతం. 2005లో పద్మశ్రీ పురస్కారంతో చిత్రను గౌరవించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించడంతో ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గాన గాంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకి ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com