ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘కిరాక్‌ పార్టీ’ మూవీ రివ్యూ

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 16, 2018, 01:40 PM



వరుసగా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ విజయాలు సాధిస్తున్న యంగ్ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం కిరాక్‌ పార్టీ. ప్రయోగాలను పక్కన పెట్టి కన్నడలో సూపర్‌ హిట్‌ అయిన కిరిక్‌ పార్టీ సినిమాను తెలుగులో కిరాక్‌ పార్టీ పేరుతో రీమేక్‌ చేశాడు నిఖిల్. శరన్‌ కొప్పిశెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా నిఖిల్ ఖాతాలో మరో సక్సెస్‌ గా నిలిచిందా..? ప్రయోగాలను పక్కన పెట్టి కమర్షియల్‌ సినిమా చేసిన నిఖిల్ మరో విజయం సాధించాడా..?


క‌థ: కృష్ణ(నిఖిల్‌) ఉషా రామా ఇంజ‌నీరింగ్ కాలేజీలో మెకానిక‌ల్ గ్రూపులో ఫ‌స్ట్ ఇయ‌ర్‌లో జాయిన్ అవుతాడు. ఇత‌ని గ్యాంగ్‌లో రాకేందుమౌళి స‌హా స్నేహితుల‌తో లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. త‌న సీనియ‌ర్ మీరా(సిమ్రాన్ ప‌రింజ‌)తో ప్రేమ‌లో పడ‌తాడు. అందువ‌ల్ల సీనియ‌ర్స్‌తో గొడ‌వ అవుతుంది. కృష్ణ‌, అత‌ని స్నేహితులంతా క‌లిసి ఓ సెకండ్ హ్యాండ్ కారును కూడా కొని దానితో మీరాను ఇంప్రెస్ చేయాల‌నుకుంటారు. ఎదుటివారిని న‌వ్వించాల‌నే కృష్ణ మ‌న‌సు న‌చ్చడంతో అత‌నంటే ఇష్ట‌పడుతుంది. అనుకోకుండా మీరా ప్ర‌మాద‌వ‌శాతు మీరా చ‌నిపోతుంది. దాంతో కృష్ణ యార‌గేంట్‌గా మారుతాడు. ఎవ‌రైనా అమ్మాయిల‌ను కామెంట్ చేస్తే వారిని చావ‌గొడుతుంటాడు. నెమ్మ‌దిగా కృష్ణ నాలుగో సంవత్స‌రంలోకి ఎంట్రీ ఇస్తాడు. అదే స‌మ‌యంలో కృష్ణ స్నేహితుడు అర్జున్ త‌న నుండి గొడ‌వ‌ప‌డి మ‌రో వ‌ర్గంగా విడిపోతాడు. రెండు వ‌ర్గాలు కాలేజ్‌లో అధిప‌త్యం కోసం గొడ‌వ‌లు ప‌డుతుంటారు. అదే స‌మ‌యంలో స‌త్య‌(సంయుక్తా హెగ్డే) కృష్ణ‌ను ఇష్ట‌ప‌డుతుంటుంది. న‌వ్వ‌డ‌మే మ‌ర‌చిపోయిన కృష్ణ‌ను మామూలు మ‌నిషిగా మార్చే ప్ర‌య‌త్నం చేస్తుంది. మ‌రి కృష్ణ లైఫ్ ఎలాంటి ట‌ర్న్ తీసుకుంటుంది? త‌ను స‌త్య‌కు ద‌గ్గ‌రైయ్యాడా? విడిపోయిన స్నేహితులందరూ క‌లుసుకుంటారా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...


 ప్ల‌స్ పాయింట్స్‌:


- నిఖిల్ న‌ట‌న‌


- అక్క‌డ‌క్క‌డా క‌నెక్ట్ అయ్యే కాలేజీ స‌న్నివేశాలు


- పాట‌లు, వాటి పిక్చ‌రైజేష‌న్‌


విశ్లేష‌ణ‌: పూర్తి స్థాయి కాలేజీ నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది. ఫ‌స్టాఫ్ అంతా స్నేహితులు.. అల్ల‌రి చిల్ల‌ర‌గా అంద‌రినీ ఆట‌ప‌ట్టించ‌డం.. క్లాసులు ఎగ‌ర‌గొట్ట‌డం. సీనియ‌ర్స్‌తో గొడ‌వ‌ప‌డ‌టం. ఇంట్లో అబ‌ద్ధాలు చెప్పి.. ఓ సెకండ్ హ్యాండ్ కారు కొని దాంట్లో చ‌క్క‌ర్లు కొట్ట‌డం ఇలాంటి స‌న్నివేశాల‌ను పాటు హీరో నిఖిల్‌.. హీరోయిన్ సిమ్రాన్ ప‌రింజ మ‌ధ్య చిన్న ప్రేమ‌క‌థ కూడా అంత‌ర్గతంగా సాగుతుంటుంది. ఇంత‌కు ముందు చాలా సినిమాల్లో చూసిన‌ట్లుగానే హీరో.. హీరోయిన్ కోసం ఆమెకు న‌చ్చిన ప‌నులు చేయ‌డం.. మందు, సిగ‌రెట్ త్రాగ‌డం మానేయ‌డం... హీరోయిన్ ఎవ‌రికో స‌హాయం చేయాల‌నుకుంటే ఆమెకు త‌న వంతుగా స‌హాయం చేయ‌డం, హీరోయిన్ మ‌న‌సుని గెలుచుకోవ‌డం.. వంటి స‌న్నివేశాలు ఈ సినిమాలో క‌న‌ప‌డ‌తాయి. ఇలాంటి స‌న్నివేశాలు చాలా సినిమాల్లో చూసినట్లుగా ఉన్నా కూడా కొన్ని స‌న్నివేశాల‌కు ప్రేక్ష‌కులు.. ముఖ్యంగా యూత్ ప్రేక్ష‌కులు క‌నెక్ట్ అయ్యే సంద‌ర్భాలు ఎక్కువ‌గా ఉన్నాయి. అలాగే సీనియ‌ర్ హీరోయిన్ వెనుక హీరో ప‌డే స‌న్నివేశాల‌న్నీ.. హ్యాపీడేస్‌లో స‌న్నివేశాలు కొన్నింటిని గుర్తుకు తెస్తాయి. ఇక సెకండాఫ్ వ‌చ్చేసరికి హీరో గ్యాంగే రెండుగా విడిపోవ‌డం.. కాలేజీ ఎల‌క్ష‌న్స్‌, గొడ‌వ‌లు.. ఓ హీరోయిన్ ప్ర‌మాద‌వ‌శాతు మ‌ర‌ణించ‌డంతో .. మ‌రో హీరోయిన్ ఎంట్రీ.. ఆమె హీరోను ప్రేమించ‌డం.. సీరియ‌స్‌గా ఉండే హీరోను న‌వ్వించేలా చేయ‌డం.. ఎప్పుడూ న‌వ్వుతూ ఉండాల‌ని చెప్ప‌డం ఇలాంటి స‌న్నివేశాల‌తో సాగుతుంది. ఇందులో కొన్ని స‌న్నివేశాలు రిపీటెడ్‌గా ఎక్క‌డో చూసిన భావన క‌లిగించినప్ప‌టికీ, కొన్ని కొత్త‌గా ఉన్న‌ట్లు అనిపిస్తాయి.


రివ్యూ : 3/5






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com