సంగీతానికి ఎల్లలులేవని చాటి చెప్పిన అమెరికా గాయని మడోన్నా. పాడటంతో పాటు పాటల రచయిత్రిగా, మంచి డాన్సరుగా, నటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఈ పాశ్చాత్య గాయని. “క్వీన్ ఆఫ్ పాప్”గా పేరు తెచ్చుకున్న మడోన్నా.. ‘ఫిల్త్ అండ్ విజ్డమ్’(2008)తో తొలిసారిగా మెగాఫోన్ పట్టుకున్నారు. తదుపరి సినిమాగా ‘W.E.’(2011)ను తెరకెక్కించారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ‘టేకింగ్ ఫ్లైట్’ అనే మూవీని రూపొందిస్తున్నారు. మైఖేలా రచించిన “టేకింగ్ ఫ్లైట్: ఫ్రమ్ వార్ ఆర్ఫన్ టు స్టార్ బాలరీనా ” పుస్తకం ఆధారంగా తెరకెక్కబోతోంది ఈ చిత్రం. ఈ సినిమా గురించి మడోన్నా మాట్లాడుతూ.. “పశ్చిమ ఆఫ్రికాలోని సియర్రా లియోన్‌కు చెందిన మైఖేలా జీవితాన్ని తెరకెక్కించడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఒక యుద్ధంలో అనాథగా మిగిలి.. సర్వం కోల్పోయి జీవితంలో ఎన్నో కష్టాలకు ఓర్చి ఒక స్టార్ బ్యాలే డాన్సరుగా, కార్యకర్తగా ఆమె ఎదిగిన వైనం నన్ను కదిలించింది. అనాథ పిల్లలకు బాసటగా నిలిచిన ఈమె కథను తెరపై ఆవిష్కరించడం నాకు ఎంతో గర్వంగా ఉంద”ని తెలిపారు.