నటిగా ఎదగడం అంటే ఏమిటో తన ప్రయాణం ద్వారా ఆలియా భట్ చూపిస్తోంది. నిన్నటిదాకా కొత్త అమ్మాయి అనే ముద్రలోనే ఉండిపోయిన ఆలియా….గత కొన్ని చిత్రాలతో తాను పరిపూర్ణ నటినని నిరూపించుకుంటోంది. హైవే, ఉడ్తా పంజాబ్, డియర్ జిందగీ…లాంటి చిత్రాలు ఆలియాను ఉత్తమ నటిగా ప్రేక్షకుల ముందు నిలబెట్టాయి. ఇక ప్రస్తుతం ఆమె చేస్తున్న రెండు సినిమాలు గల్లీ బారు, రాజీ వేటికవి భిన్నమైనవే. ఈ రెండు సినిమాలు ఆలియాను వెండితెరపై మరింత ఎత్తుకు తీసుకెళ్లనున్నాయి. నటిగా ప్రశంసలు దక్కడం తనపై బాధ్యతను పెంచుతాయని, ప్రతి పాత్రను పండించడం వెనుక ఎంతో శ్రమ, అంకితభావం దాగి ఉన్నాయంటోంది ఆలియా. ఇది చేయను అని ఎప్పుడూ చెప్పలేదని, పాత్రలో జీవించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తానంటోంది ఆలియా. ఈ బాలీవుడ్ సుందరి మాట్లాడుతూ…ఏ పని చేసినా భయమేస్తుంది. ప్రేక్షకులు నేను బాగా నటించానని చెప్పినా భయమేస్తుంది. గొప్పవాళ్ల ప్రశంసలు దక్కినప్పుడు జీవితం చాలా బాగుందని మాత్రం అనిపిస్తుంటుంది. గొప్ప దర్శకులతో పనిచేయడం కేవలం అదష్టం అనుకోను. సినిమాలు చేసే మాయాజాలం అది. ఆ మాయే మా అందరినీ ఒక దగ్గరకు చేరుస్తుంది. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు అనుకుంటాను. దర్శకురాలు మేఘనా గుల్జార్, జోయా అక్తర్, గౌరీ షిండే లాంటి దర్శకురాళ్లతో పనిచేయాలన్నది నా కల. అది నా జీవితంలో ఇంత తక్కువ సమయంలో నెరవేరడం సంతోషంగా ఉంది అని చెప్పింది.