తాజాగా కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకకు నవ వధువు సోనమ్ కపూర్ హాజరయింది. వారం రోజుల క్రితమే సోనమ్ తన ప్రియుడు ఆనంద్ అహూజాను వివాహం చేసుకుంది. దాంతో ఆమె కేన్స్ వేడుకకు హాజరయ్యే అవకాశాలు తక్కువేనని బాలీవుడ్లో వార్తలు వినిపించాయి. కానీ తన భర్తతో కలిసి ఫ్రాన్స్‌కు వెళ్లిన సోనమ్ కేన్స్ వేడుకకు హాజరై అందరినీ సర్ప్రైజ్ చేశారు. ప్రముఖ ఆస్ట్రేలియన్ డిజైనర్లు రాల్ఫ్ అండ్ రూస్సో డిజైన్ చేసిన ఆఫ్ వైట్ లెహెంగాలో సోనమ్ అందంగా ముస్తాబయ్యారు. తన నిశ్చితార్థం ఉంగరంలాగే ఉన్న కమ్మలు పెట్టుకోవడంతో మరింత ఆకర్షణగా నిలిచారు. అదీకాకుండా అచ్చం పెళ్లి కూతురులాగే జుట్టు అల్లుకుని జడకుచ్చులు పెట్టుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.కేన్స్ వేడుక అనంతరం సోనమ్ తన భర్త ఆనంద్‌తో కలిసి కొన్ని రోజులు ఫ్రాన్స్‌లోనే విహరించనుంది.