ప్రస్తుత బాలీవుడ్ హీరోయిన్లలో నంబర్ వన్ ఎవరంటే మరో మాట లేకుండా దీపికా పదుకొనే పేరు చెప్పేయొచ్చు. గత కొన్నేళ్లలో ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్.. మార్కెట్ బాగా పెరిగింది. పీకూ.. బాజీరావ్ మస్తానీ.. పద్మావత్ సినిమాలతో తిరుగులేని స్థాయిని అందుకుంది దీపిక. మధ్యలో హాలీవుడ్ మూవీ ‘ట్రిప్లెక్స్’లోనూ నటించి మెప్పించింది. దీపిక సినిమాలో హీరో ఎవరైనా పర్వాలేదు.. ఆమె పేరు మీదే సినిమాలకు బిజినెస్ అయ్యే స్థాయి ఉంది. ఈ క్రేజ్ ను ఉపయోగించుకుని దీపికా ప్రధాన పాత్రలో ఒక సూపర్ హీరోయిన్ సినిమా తీయబోతున్నారట. హాలీవుడ్లో ఏంజెలినా జోలి చేసిన ‘టూంబ్ రైడర్’ తరహాలో ఈ సినిమా ఉంటుందట. ఫాక్స్ స్టార్ ఇండియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు సమాచారం. ఓ ప్రముఖ దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు.
‘పద్మావత్’ తర్వాత ప్రస్తుతం దీపిక షారుఖ్ ఖాన్ ‘జీరో’ సినిమాలో మాత్రమే నటిస్తోంది. దాని తర్వాత ఇర్ఫాన్ ఖాన్ తో కలిసి ఓ వైవిధ్యమైన సినిమా చేయాల్సి ఉంది. కానీ ఇర్ఫాన్ అనారోగ్యం పాలై ఆసుపత్రికి పరిమితం కావడంతో ఆ సినిమా ఆగిపోయింది. దాని స్థానంలో సూపర్ హీరోయిన్ సినిమా వచ్చింది. ఇండియాలో హీరోయిన్లను నమ్ముకుని సూపర్ హీరోయిన్ సినిమాలు చేయడానికి ఫిలిం మేకర్స్ ఎవ్వరూ ముందుకు రారు. కానీ దీపిక స్టార్ ఇమేజ్ ఇప్పుడు భరోసా ఇస్తోంది. మరోవైపు దీపిక ఈ ఏడాది చివర్లో తన ప్రియుడు రణ్వీర్ సింగ్ ను పెళ్లాడబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. వీళ్లిద్దరూ దాదాపు ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ‘రామ్ లీలా’.. ‘బాజీరావ్ మస్తానీ’.. ‘పద్మావత్’ లాంటి సినిమాల్లో వీళ్లిద్దరూ కలిసి నటించారు. దీపిక గతంలోనూ ప్రేమాయణాలు నడిపినప్పటికీ రణ్వీర్ విషయంలో మాత్రం సీరియస్ గా ఉంది. వీళ్ల బంధం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది.