ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జయ జానకి నాయక మూవీ రివ్యూ

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 11, 2017, 12:54 PM



చిత్రం: జయ జానకి నాయక
నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌.. రకుల్‌ప్రీత్‌ సింగ్‌.. జగపతిబాబు.. ప్రగ్యా జైస్వాల్‌.. శరత్‌కుమార్‌.. వాణీ విశ్వనాథ్‌ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
ఛాయాగ్రహణం: రిషి పంజాబీ
నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి
రచన-దర్శకత్వం: బోయపాటి శ్రీను
సంస్థ: ద్వారకా క్రియేషన్స్‌
విడుదల: 11-08-2017
రెట్టింగ్: 2.5

మాస్‌ దర్శకులలో బోయపాటి శ్రీను శైలి విభిన్నం. ఏ కథ తీసుకొన్నా.. అందులో తగినంత యాక్షన్‌ మిక్స్‌ చేయాల్సిందే. ‘భద్ర’ నుంచి ‘సరైనోడు’ వరకూ ఆయన బలం.. ఆ యాక్షనే. బడా స్టార్లతో పనిచేసిన బోయపాటి తొలిసారి ఓ యువ కథానాయకుడితో జట్టు కట్టారు. పైగా.. ఓ ప్రేమకథని ఎంచుకొన్నారు. మాస్‌ టైటిళ్లతో అదరగొట్టే శ్రీను.. ఈసారి ‘జయ జానకి నాయక’ అనే సున్నితమైన పేరు పెట్టారు. మరి ఈ ప్రయత్నం బోయపాటికి ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది? బోయపాటి ఆవిష్కరించిన ఆ సరికొత్త కోణం ఏమిటి? ‘జయ జానకి నాయక’ ఏ తరహా చిత్రం?

కథ

గగన్‌(బెల్లంకొండ శ్రీనివాస్‌)కు కుటుంబం అంటే చాలా ఇష్టం. నాన్న చక్రవర్తి (శరత్‌కుమార్‌) అన్నయ్య(నందు)లంటే అత‌నికి ప్రాణం. గగన్‌కు స్వీటి(రకుల్‌ప్రీత్‌సింగ్‌) పరిచయం అవుతుంది. ఆమె రాకతో చక్రవర్తి ఇంటి స్వరూపమే మారిపోతుంది. స్వీటి-గగన్‌ ప్రేమించుకుంటారు. అయితే స్వీటి జీవితంలో అనుకోని ఓ సంఘటన ఎదురవుతుంది. అప్పటి వరకూ సీతాకోకచిలుకలా ఎగిరిన ఆమె.. ఒక్కసారిగా పంజరంలో పావురం అవుతుంది. అలాంటి స్వీటిని రక్షించడానికి గగన్‌ కుటుంబం ఏం చేసింది? అశ్వింత్‌ నారాయణ (జగపతిబాబు)కీ, స్వీటికి ఉన్న సంబంధం ఏమిటి? తదితర విషయాలు తెరమీద చూడాలి.


ఎలా ఉందంటే

ఇదో ప్రేమ కథ. ప్రేమించిన అమ్మాయి కోసం ఓ యువకుడు ఏం చేశాడు? ఎవరిపై పోరాటం చేశాడు? అనే ఇతివృత్తంతో సాగుతుంది. ఆ కథ చుట్టూనే యాక్షన్‌ ఎమోషన్‌ సన్నివేశాలను అల్లుకున్నాడు దర్శకుడు. బోయపాటి శ్రీను ప్రధాన బలం యాక్షన్‌. అతను ఏ కథ ఎంచుకున్నా యాక్షన్‌.. మాస్‌ మసాలా బాగా దట్టిస్తాడు. ఈసారి అదే దారిలో నడిచాడు. సినిమా ప్రారంభం నుంచే ఓ ఎమోషన్‌ డ్రైవ్‌తో సాగుతుంది. యాక్షన్‌ ఘట్టాలు, వాటి ముందు వచ్చే లీడ్‌ సన్నివేశాలను దర్శకుడు బాగా రాసుకున్నాడు. దాంతో మాస్‌ ప్రేక్షకులకు ఆయా సన్నివేశాలు నచ్చుతాయి. పరువు-పంతం వీటి నడుమ ఓ అమ్మాయి ఎలా నలిగిపోయింది అనే విషయాన్ని దర్శకుడు సమర్థంగా తెరకెక్కించగలిగాడు. హంసలదీవిలో తెరకెక్కించిన యాక్షన్‌ ఎపిసోడ్‌ సినిమా మొత్తానికి హైలైట్‌గా నిలుస్తుంది. శరత్‌కుమార్‌ ఉన్న సన్నివేశాలు కుటుంబ ప్రేక్షకులకు నచ్చుతాయి. ఇదో ప్రేమకథ అయినప్పటికీ నాయకనాయికల మధ్య రొమాన్స్‌ కంటే హీరో-విలన్ల మధ్య ఎమోషన్‌కు దర్శకుడు పెద్ద పీట వేయడం గమనార్హం. లెక్కకు మించిన యాక్షన్‌ సన్నివేశాలతో తెరపై అధిక భాగం ఫైట్లకే పరిమితం చేసినా, దాని చుట్టూ ఎమోషన్‌ సన్నివేశాలు ప్రేక్షకుడిని కదలకుండా చేస్తాయి.


 


ఎవరెలా 


బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు ఇది మూడో సినిమా. అతని బలాలు, బలహీనతలు బోయపాటి బాగా గమనించాడు. అందుకు తగినట్టుగానే సన్నివేశాలు రాసుకున్నాడు. యాక్షన్‌, నృత్య సన్నివేశాల్లో శ్రీనివాస్‌ ప్రతిభ కనిపిస్తుంది. క్లైమాక్స్‌లో ఎమోషనల్‌ డైలాగ్‌లు బాగా పలికాడు. రకుల్‌ పాత్ర రెండు కోణాల్లో సాగుతుంది. తొలి సగం ఓ సాధారణ అమ్మాయిగా కనిపించిన ఆమె.. ద్వితీయార్ధంలో పీకల్లోతు కష్టాల్లో ఉన్న అమ్మాయిగా, నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో ఆకట్టుకుంది. జగపతిబాబు ఈ చిత్రంలో మరింత స్టైలిష్‌గా కనిపించారు. ఆయన వచ్చే ఆరంభ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. నందూకి కూడా మంచి పాత్రే దక్కింది. శరత్‌కుమార్‌ నటన, ఆయన చుట్టూ నడిపించిన సన్నివేశాలు అలరిస్తాయి. చాలా కాలం తర్వాత వాణీ విశ్వనాథ్‌ తెరపై కనిపించారు. అయితే ఆ పాత్రకు ప్రాధాన్యం దక్కలేదు.


సాంకేతికంగా

చిత్రంలో అడుగడుగునా భారీతనం, నిర్మాణ విలువలు కనిపిస్తాయి. చిన్న పాత్రలోనూ గుర్తింపు ఉన్న నటుడే కనిస్తాడు. దేవిశ్రీ ప్రసాద్‌ నేపథ్య సంగీతం బాగుంది. ‘వీడే వీడే’ అనే పాటలో సాహిత్యం ఆక‌ట్టుకుంటుంది. రిషీ పంజాబీ కెమేరా పనితనం మరో ప్రధాన ఆకర్షణ. కేథరిన్‌ ఐటమ్‌ సాంగ్‌ బాగున్నా, ఇరికించినట్టు అనిపిస్తుంది. బోయపాటి శ్రీను తనదైన మార్కు చూపించాడు. కథా, కథనాల్లో మలుపులు ఉన్నా, అవి సమర్థంగా తెరపై చూపించకపోవడం లోపంగా చెప్పుకోవచ్చు.

బలాలు
+ యాక్షన్‌ సన్నివేశాలు
+ సాంకేతికవర్గ పనితీరు
+ భారీతనం

బలహీనతలు
- వినోదం లేకపోవడం
- మితిమీరిన యాక్షన్‌ సన్నివేశాలు

చివరిగా: మాస్‌ చిత్రం ‘జయ జానకి నాయక’ 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com