జాక్వెలిన్‌ ఇంట్లో సల్మాన్‌ పెయింటింగ్‌

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 12, 2017, 12:12 PM
 

బాలీవుడ్‌ భామ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ని ఇప్పుడు కాస్త కదిలించామంటే చాలు... ఆపకుండా తన కొత్తింటి కబుర్లు బోలెడన్ని చెప్పేస్తుంది. ఈమధ్యే ఆమె ముంబైలో ఓ ఖరీదైన ఇల్లు కొంది. కొనడమే ఒకెత్తయితే.. దాని ఇంటీరియర్‌ డిజైనింగ్‌ మరో ఎత్తట. తన అభిరుచికి అనుగుణంగా విద్యుత్‌ దీపాలు, ఖరీదైన పెయింటింగ్‌లతో నింపేసిందట. లివింగ్‌రూమ్‌లో అయితే సల్మాన్‌ఖాన్‌ స్వయంగా వేసిన పెయింటింగ్‌ ఉండి తీరాల్సిందే అని దాన్ని ప్రత్యేకంగా కొలువు తీర్చిందట. బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌లో ఓ మంచి గీతకారుడు ఉన్నాడన్న విషయం తెలిసిందే.


ఖాళీ దొరికితే చాలు ఆయన పెయింటింగ్‌లు వేసేస్తుంటాడు. ఆ పెయింటింగ్‌లన్నింటినీ అమ్మేసి తన స్వచ్ఛంద సంస్థ బీయింగ్‌ హ్యూమన్‌ కోసం వినియోగిస్తుంటారు. జాక్వెలిన్‌ మాత్రం తన కొత్తింటికి కావాల్సిన గృహోపకరణాల్ని కొనుగోలు చేస్తూనే ఉందట. ‘‘నాకు కళలంటే చాలా ఇష్టం. అందుకే వివిధ కళాకృతుల్ని కొనుగోలు చేస్తూ ఇంట్లో అలంకరిస్తున్నా. కానీ నా తనివి తీరడం లేదు. నాకు తెలిసి ఇంకా చాలా రోజులపాటు గృహోపకరణాల్ని కొంటూనే ఉంటానేమో’’ అని చెబుతోంది ఈ అమ్మడు. శ్రీలంకకి చెందిన జాక్వెలిన్‌ బాలీవుడ్‌లో స్థిరపడిపోయింది.
Recent Post