ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘పంతం’ మూవీ రివ్యూ

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 05, 2018, 01:08 PM



హీరో గోపిచంద్ నటించిన 25వ సినిమా ‘పంతం’. దర్శకుడు కె.చక్రవర్తి దర్శకత్వంలో రూపోందిన ఈ సినిమా ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఎప్పుడు చూద్దాం..


కథ: రాష్ట్రంలోని రాజకీయ నాయకులంతా ఒక సిండికేట్ గా మారి నాయక్ (సంపత్) అనే మారుపేరుతో ఉన్న హోమ్ మినిస్టర్ అండతో ప్రజల డబ్బుని దారి మళ్లించి తమ ఖాతాల్లో వేసుకుంటుంటారు. ఆ డబ్బు మొత్తాన్ని విక్రాంత్ సురాన (గోపిచంద్) తెలివిగా కాజేస్తుంటాడు.దాంతో విక్రాంత్ ను ఎలాగైనా పట్టుకోవాలని నాయక్ గ్యాంగ్ ట్రై చేస్తుంటారు. అసలు విక్రాంత్ ఎవరు, అతను కేవలం హోమ్ మినిస్టర్ ను ఎందుకు టార్గెట్ చేశాడు, అతన్నుండి కొట్టేసిన ఆ డబ్బుని ఏం చేశాడు, అసలు హోమ్ మిస్టర్ కాజేసిన డబ్బు ఎవరిది అనేదే సినిమా.


ప్లస్ పాయింట్స్ : సినిమాలో ప్రధాన ప్లస్ పాయింట్ అంటే సినిమా ప్లాట్. చాలా సినిమాల్లో చూసినట్టుగా కాకుండా ఇందులో పొలిటీషియన్స్ కాజేసే డబ్బుకు సంబందించిన అంశం ఆసక్తికరంగా, ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. హీరో గోపిచంద్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకోగా పరిణితి చెందిన ఆయన నటన, యాక్షన్ సన్నివేశాల్లో ఫైట్స్ బాగున్నాయి.


ఫస్టాఫ్ మొత్తాన్ని కొంత పృథ్వి కామెడీతో, ఆసక్తికరమైన రెండు రాబరీ సీన్స్ తో నడిపిన దర్శకుడు క్లైమాక్స్ లో వచ్చే కోర్ట్ రూమ్ డ్రామాలో మంచి మంచి సామాజిక అంశాల్ని ప్రస్తావించి ఆలోచింపజేశారు. అలాగే ద్వితీయార్థంలో రివీల్ అయ్యే సినిమా అసలు ప్లాట్ కన్విన్సింగా ఉండి ఆకట్టుకుంది.


దర్శకుడు ఒక సామాజిక అంశానికి కమర్షియల్ అంశాలని ఆపాదించాలని చేసిన ప్రయత్నం కొంత వరకు ఫలించింది. హీరోయిన్ మెహ్రీన్ లుక్స్ పరంగా ఆకట్టుకోగా ప్రతినాయకుడిగా చేసిన సంపత్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకోగా కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హాస్యం అక్కడక్కడా పండింది.


మైనస్ పాయింట్స్ :  సినిమా ప్లాట్ సామాజిక అంశాలతో ముడిపడి బాగానే ఉన్నా ఇప్పటికే అలాంటి ప్లాట్ ఆధారంగా చాలా సినిమాలు వచ్చి ఉండటంతో సినిమా చూస్తున్నంతసేపు పెద్దగా థ్రిల్ కలుగదు. దర్శకుడు చక్రవర్తి రాసుకున్న కథనం ఆఖరి క్లైమాక్స్ మినహా మరెక్కడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రతి సన్నివేశం ఎక్కడో చూసినట్టుగానే ఉంటుంది.


సినిమా సగం పూర్తైన తర్వాత కానీ అసలు కథ, హీరో లక్ష్యం ఏమిటి అనేది రివీల్ కాకపోవడంతో అసలు సినిమా గమ్యం ఏమిటో బోధపడక చూసేవారిలో కొంత నీరసం కలుగుతుంది. ప్రథమార్థంలో కొంత కామెడీని రుచి చూపించిన డైరెక్టర్ సెకండాఫ్లో క్లైమాక్స్ మినహా ఎక్కడ ఎంటర్టైన్ చేయలేకపోయారు.


ప్రతినాయకుడిని ఆరంభంలో హెవీగా ఎలివేట్ చేసి ఆ తరవాత ఒక్క చోట కూడ హీరోకి ఛాలెంజ్ విసిరేలా వాడుకోకపోవడం, అన్ని అంశాలు హీరోకి అనుకూలంగా మారిపోతుండటం మరీ నాటకీయంగా అనిపించింది. హీరో హీరోయిన్ల నడుమ రొమాన్స్ అనే మాటకి తావే లేకుండా పోయింది.


సాంకేతిక విభాగం : పైన చెప్పినట్టు దర్శకుడు కె.చక్రవర్తి మంచి ప్లాట్ ను తీసుకున్నా దాన్ని పాత ఫార్మాట్లోనే ప్రెజెంట్ చేయడంతో సినిమాలో పెద్దగా కొత్తదనం కనబడలేదు. క్లైమాక్స్ మినహా కథనం ఎక్కడా రక్తి కట్టకపోగా నాటకీయత కూడ ఎక్కువై సినిమాలో రొటీన్ నేచర్ కొట్టొచ్చినట్టు కనబడింది.


సంగీత దర్శకుడు గోపి సుందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉన్నా పాటల సంగీతం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. చిత్రంలోని యాక్షన్ సీన్స్ బాగున్నాయి. ఎడిటింగ్ బాగానే ఉంది. ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాత కె.కె.రాధామోహన్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com