హైదరాబాద్: విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. కొందరు ఈ సినిమా అద్భుతంగా ఉందని అంటుంటే.. మరికొందరు అసభ్యకర సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయంటూ విమర్శిస్తున్నారు.
అయితే, సినిమా టీజర్లో విజయ్ మహిళల గురించి తప్పుగా మాట్లాడిన డైలాగ్ ఒకటుంది. దానిని సినిమాలో కత్తిరించినా ఇటీవల జరిగిన ప్రచార కార్యక్రమంలో విజయ్ ఆ డైలాగ్ పలికాడు. దీనిపై నటి, వ్యాఖ్యాత అనసూయ భరద్వాజ్ ట్విటర్ ద్వారా స్పందించారు.
‘సినిమా ఫస్ట్‌లుక్ చూసి చాలా బాగుంది అనుకున్నా. సినిమా చూడాలని ఎప్పటి నుంచో ఆతృతగా ఎదురుచూస్తున్నా. కానీ, చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను ఎలా నిర్వహిస్తోందో చూడండి. చెప్పాలంటే ఆ ప్రచార కార్యక్రమాన్ని నేను చూడలేదు. చూసే ధైర్యం కూడా లేదు. ఓ తల్లి గురించి అలా మాట్లాడటం చాలా తప్పు. ఏదేమైనా ఈ విషయం గురించి నేను ఇంకేమీ మాట్లాడదలుచుకోలేదు. ఏది సరైనదో ఏది కాదో మనకి తెలిస్తే చాలు.’ అని ట్వీట్ చేసింది. అనసూయ ట్వీట్లపై కొందరు నెటిజన్లు సానుకూలంగా స్పందించగా.. మరికొందరు ఆమె కామెంట్లను వ్యతిరేకించారు.