ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పైసా వసూల్‌ రివ్యూ

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 01, 2017, 11:29 AM



చిత్రం: పైసా వసూల్‌
నటీనటులు: బాలకృష్ణ.. శ్రియ.. ముస్కాన్‌ సేథి.. కైరా దత్‌.. విక్రమ్‌జీత్‌.. కబీర్‌ బేడి.. అలోక్‌ జైన్‌.. పృథ్వీరాజ్‌.. అలీ తదితరులు
ఛాయాగ్రహణం: ముకేష్‌ జి
కూర్పు: జునైద్‌ సిద్దిఖీ
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
నిర్మాత: వి.ఆనంద్‌ ప్రసాద్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌
బ్యానర్‌: భవ్య క్రియేషన్స్‌

విడుదల: 01-09-2017


ఈ ఏడాది బాలకృష్ణ తన సినీ కెరీర్‌లో అరుదైన మైలురాయిని అందుకున్నారు. ‘గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి ’తో శతకం కొట్టి, బాక్సాఫీస్‌ వద్ద మరోసారి తన సత్తా చాటారు. ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం ప్రయత్నించే బాలయ్య దర్శకుడు పూరి జగన్నాథ్‌ చెప్పిన కథకు పచ్చజెండా వూపి అందర్నీ ఆశ్చర్యపరిచారు. మిగతా దర్శకుల సినిమాల్లో కథానాయకుడి పాత్రకు, పూరి సినిమాల్లోని పాత్రకు చాలా ‘తేడా’ ఉంటుంది. మాస్‌ను దృష్టిలో పెట్టుకునే పూరి తన కథానాయకుడి పాత్రను తీర్చిదిద్దుతారు. ఒకరకంగా చెప్పాలంటే ‘చంటిగాడు లోకల్‌’ టైపు. మరి బాలకృష్ణలాంటి అగ్రకథానాయకుడు ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తే? అభిమానులకు, ప్రేక్షకులకు అది ‘పైసా వసూల్‌’ లాంటి కిక్‌ నిచ్చిందా? సరికొత్త కాంబినేషన్‌ ఆకట్టుకుందా?


కథేంటి: తేడాసింగ్‌(బాలకృష్ణ).. తీహార్‌ జైలు నుంచి బయటకు వస్తాడు. దేనికీ భయపడడు. ఎవరినైనా ఎదిరిస్తాడు. మరోపక్క బాబ్‌మార్లే(విక్రమ్‌జీత్‌) అనే ఇంటర్నేషనల్‌ మాఫియాడాన్‌ కోసం భారతదేశ పోలీసులు వెతుకుతుంటారు. అత‌ను పోర్చుగ‌ల్‌లో ఉండి ఇండియాలో విధ్వంసాలు సృష్టిస్తుంటాడు. అతడిని పట్టుకోవాలంటే ఇక్కడి చట్టాలు, ప్రభుత్వాలు అడ్డు వస్తుంటాయి. దీంతో మరో గ్యాంగ్‌స్టర్‌తో అతడిని హతమార్చడమే సరైన మార్గమని భావిస్తాడు ‘రా’ అధికారి(కబీర్‌బేడి). ఇదే సమయంలో తేడాసింగ్‌ వీరికి కనపడతాడు. ఈ తేడాసింగ్‌ను ఉపయోగించుకుని బాబ్‌మార్లేను అంతమొందించడానికి స్కెచ్‌ వేస్తారు. మరి ఆ మాఫియాడాన్‌ను తేడాసింగ్‌ పట్టుకున్నాడా? అతడిని తుదముట్టించాడా? అసలు ఈ తేడాసింగ్‌ ఎవరు? తదితర విషయాలను తెరపై చూడాల్సిందే.


ఎలా ఉందంటే: ‘పైసా వసూల్‌’ పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమా అభిమానులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ వసూలు చేసి మరీ ఇచ్చేలా దర్శకుడు పూరి జగన్నాథ్‌ తీర్చిదిద్దారు. బాలకృష్ణ పాత్రను డిజైన్‌ చేసుకోవడం, ఆయనతో కొత్త తరహా సంభాషణలు పలికించడంలో పూరి వందశాతం సక్సెస్‌ అయ్యారు. ‘తేడాసింగ్‌’ పాత్రలో చాలా వేరియేషన్స్‌ కనిపిస్తాయి. అవన్నీ అభిమానులకు నచ్చుతాయి. బాలకృష్ణ తెరపై ఎప్పుడు కనిపించినా ప్రేక్షకుడు ఎంటర్‌టైన్‌ అవుతాడు. ఈ సినిమాకు సంబంధించి ప్రధాన బలం ఆయనే. ప్రతి సన్నివేశంలో బాలకృష్ణ పలికే డైలాగ్‌లు ఉర్రూతలూగిస్తాయి. యాక్షన్‌ సన్నివేశాలకు దర్శకుడు పెద్ద‌పీట వేశారు. పోర్చుగల్‌ ఎపిసోడ్‌ పెద్దదిగా ఉన్నా, పూరి సరికొత్తగా ఆయా సన్నివేశాలను చూపించారు. పూరి గత చిత్రాల ఛాయలు అక్కడక్కడా కనిపిస్తున్నా, మధ్యలో వచ్చే ట్విస్టులు కొత్తగా అనిపిస్తాయి. పూరి కథానాయకుడి పాత్రలో బాలయ్య పరకాయ ప్రవేశానికి నిదర్శనం ‘పైసా వసూల్’.


ఎవరెలా చేశారంటే: ఒక కొత్త బాలకృష్ణను చూడాలంటే ‘పైసావసూల్’ చూడాల్సిందే. ఇందులో బాలకృష్ణ డైలాగ్‌ డెలివరీ గత సినిమాల్లో ఎక్కడా కనిపించదు. ఇదే ప్రధాన హైలైట్‌. ఇక బాలయ్య పాడిన పాటకు థియేటర్లో విజిల్స్‌ పడాల్సిందే. విశ్రాంతి ఘట్టానికి ముందు బాలకృష్ణ పలికిన డైలాగ్‌ (ఓన్లీ ఫ్యాన్స్‌ అండ్‌ ఫ్యామిలీ, ఔటర్స్‌ నాట్‌ అలౌడ్‌) ఇంకొంత కాలం మార్మోగుతుంది. హీరోయిన్లు ముగ్గురు ఉన్నా అధిక ప్రాధాన్యం శ్రియకు మాత్రమే. పోర్చుగల్‌ ఎపిసోడ్‌లో మాత్రమే ఆమె కనిపిస్తుంది. కథకు ఆ పాత్రే కీలకం. కైరా దత్‌ ఐటమ్‌ సాంగ్‌లో చిందులు వేయడంతో పాటు ఆమె పాత్ర ఏంటనేది ఆసక్తికరం. ముస్కాన్‌ ఓ పాట, కొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితమైంది. కథానాయికల్లో బాలయ్య కెమిస్ట్రీ వర్క్‌అవుట్‌ అయింది శ్రియతోనే. పూరి ప్రతీ సినిమాలో కనిపించే అలీ ఈసారీ ఓ పాత్రను దక్కించుకున్నారు. కబీర్‌బేడీ ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తారు. అతని పాత్ర ఆకట్టుకుంటుంది. మిగిలిన వారు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. పూరి గత చిత్రాల్లో మాదిరిగానే పూరి విలన్‌ గ్యాంగ్‌ కనిపిస్తుంది.


దర్శకుడు పూరి జగన్నాథ్‌ కేవలం బాలకృష్ణ పాత్ర మీదే దృష్టి పెట్టారు. సినిమాను కూడా అలాగే డిజైన్‌ చేశారు. ఆ పాత్ర ప్రేక్షకుడికి 100శాతం ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తుంది. పూరి మాటల పదును అక్క‌డ‌క్క‌డా కనిపిస్తుంది. దేశం గురించి, దేశభక్తి గురించి చెప్పిన తీరు అందరికీ నచ్చుతుంది. కథ, కథనాల పరంగా కొద్దిగా తప్పులు దొర్లినా కథానాయకుడి పాత్ర ముందు అవేవీ పెద్దగా కనిపించవు. అనూప్‌ పాటలు బాగున్నాయి. ‘పైసా వసూల్’, ‘మామా ఏక్‌ పెగ్‌లా’ మాస్‌కు నచ్చుతాయి. కెమేరా పనితనం కూడా ఆకట్టుకుంటుంది. సినిమా నిడివి తక్కువ. చాలా షార్ప్‌గా ఎడిట్‌ చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.


బలాలు
+ బాలకృష్ణ
+ డైలాగ్‌లు
+ కథను తీర్చిదిద్దిన విధానం
+ ఎడిటింగ్






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com