అల్లుడితో మళ్లీ వెంకీ ..

  Written by : Suryaa Desk Updated: Fri, Sep 08, 2017, 02:21 PM
 

టాలీవుడ్ మల్టీస్టారర్ మూవీ అంటే గతంలో అదో ఊహ మాత్రమే అనుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సీనియర్ల నుంచి జూనియర్ల వరకు.. స్టార్స్ నుంచి చిన్న హీరోల వరకూ ప్రతీ ఒక్కరూ మల్టీ స్టారర్ కాన్సెప్టులపై ఆసక్తి చూపుతున్నారు. సీతమ్మ వాకిట్లో చిత్రంలో మహేష్ తో కలిసి ఈ ట్రెండ్ ను ఆరంభించిన వెంకటేష్.. గతంలో నాగచైతన్య నటించిన ప్రేమమ్ మూవీలో ఓ కేమియో కూడా చేసి అలరించాడు.


ఇప్పుడీ మేనమామ-మేనల్లుడు కలిసి మరోసారి ఆన్ స్క్రీన్ పై కనిపించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ రీసెంట్ గా వెంకీని కలిసి ఓ కథ వినిపించాడట. ఫ్యామిలీ డ్రామా అయిన ఈ కథ వెంకటేష్ కు విపరీతంగా నచ్చేసిందట. పైగా గతంలో నాగార్జునతో సోగ్గాడే చిన్ని నాయన.. చైతుతో రారండోయ్ వేడుక చూద్దాం వంటి హిట్ చిత్రాలను తీసిన దర్శకుడు కావడంతో.. కళ్యాణ్ కృష్ణకు వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడట. అయితే.. ఈ కథలో ఓ ప్రధానమైన కేరక్టర్ ను ఎవరితో చేయించాలనే దగ్గరే సమస్య ఉత్పన్నమైందట. దీనికి కూడా సొల్యూషన్ చూపించేసిన వెంకటేష్.. ఆ రోల్ కు చైతు అయితే పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడని చెప్పాడట.


తనకు హిట్ ఇచ్చిన దర్శకుడు.. మామయ్యతో కలిసి మల్టీస్టారర్ మూవీలో నటించమని అడగడమనడం.. అది కూడా వెంకీయే స్వయంగా ఈ ఆఫర్ ను తన దగ్గరకు పంపడంతో.. చైతు కూడా వెంటనే ఈ రోల్ కు ఒప్పుకున్నాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ ఫ్యామిలీ మల్టీ స్టారర్ పై ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. 
Recent Post