అరవోళ్లకు చుక్కలు చూపించిన పూనమ్ కౌర్

  Written by : Suryaa Desk Updated: Mon, Sep 11, 2017, 12:26 PM
 

పూనమ్ కౌర్ గుర్తుంది కదా..? శ్రీకాంత్ హీరోగా నటించిన ‘మాయాజాలం’తో కథానాయికగా పరిచయమై.. ఆ తర్వాత ‘వినాయకుడు’.. ‘గగనం’ లాంటి సినిమాల్లో సహాయ పాత్రలతో ఆకట్టుకున్న ఈ అమ్మాయికి ఈ మధ్య తెలుగులో అవకాశాలు బాగా తగ్గిపోయాయి. దాదాపుగా ఆమె కెరీర్ ముగింపు దశకు వచ్చేసిందిక్కడ. ఇలాంటి తరుణంలో తమిళంలో ఒక అవకాశం వస్తే దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది పూనమ్.


ఆమె ఒప్పుకున్న సినిమాను చెప్పా పట్టకుండా వదిలేసి వచ్చేసిందట. తాము ఆమె కోసం అన్నీ సమకూర్చి పెడితే.. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయిందంటూ పూనమ్ మీద ఆరోపణలు చేస్తున్నారు.


ఇప్పటికే ‘ఉన్నై పోల్ ఒరువన్’.. ‘నాయకి’ లాంటి తమిళ సినిమాల్లో నటించిన పూనమ్‌కు ఇటీవలే ‘పూనం నండు’ అనే సినిమాలో అవకాశం దక్కింది. ఐతే శనివారం నాడు షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకోగా.. సెట్ కు వచ్చిన పూనమ్ దర్శకుడితో యూనిట్ సభ్యులతో ఏదో విషయమై గొడవ పడిందట. కాసేపటి తర్వాత కనిపించకుండా పోయిందట. ఫోన్ చేస్తే మాట్లాడకుండా కట్ చేస్తోందని.. ఆమెపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేస్తామని ప్రొడక్షన్ మేనేజర్ మీడియాకు వెల్లడించాడు. 


పూనమ్ కు స్టార్ హోటల్లో బస ఏర్పాటు చేసి.. ఆమె అడిగిందల్లా ఇచ్చామని.. తాము పెట్టిన కాస్ట్యూమ్ డిజైనర్ వద్దంటూ సొంతంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసుకుంటానని చెప్పి నిర్మాత నుంచి అదనంగా డబ్బులు తీసుకుందని.. దీంతో పాటు అనేక రకాలుగా నిర్మాత మీద భారం పెంచి ఇప్పుడు షూటింగ్ నుంచి వెళ్లిపోవడం ఎంత వరకు న్యాయమని అతను ప్రశ్నించాడు. ఈ వివాదంపై పూనమ్ ఏమంటుందో చూడాలి.
Recent Post