ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవల్లీ సినిమా రివ్యూ

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 16, 2017, 12:33 PM



బాహుబలి, బజరంగీ భాయీజాన్ లాంటి విజయవంతమైన సినిమాలకు కథ సమకూర్చిన వ్యక్తిగా రచయిత విజయేంద్రప్రసాద్‌కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ఆయన దర్శకుడిగా మారి తన జీవితంలోని ఓ వింత అనుభవం నేపథ్యంలోని కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం 'శ్రీవల్లీ'. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మైండ్ మ్యాపింగ్ అనే వైవిధ్య తరహా కాన్సెప్టుతో రూపొందించిన ఈ సినిమా శుక్రవారం (సెప్టెంబర్ 15) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేఫథ్యంలో ఈ సినిమా అంచనాలను ఏ మేరకు అందుకుందో చూద్దాం.. 


కథ: ప్రముఖ సైంటిస్టు రామచంద్ర (రాజీవ్ కనకాల) కూతురు.. శ్రీవల్లి (నేహా హింగె). చిన్నతనం నుంచే ఆమెకు స్కూల్ ఫ్రెండ్ గౌతమ్ (రజత్ క్రిష్ణ), తన సోదరుడితో బాగా అనుబంధం ఉంటుంది. పెద్దయ్యాక తన తండ్రి, సోదరుడితో పాటు ఆమె చాలాకాలం అమెరికాలో ఉండిపోతుంది. ఇండియాలో సైంటిఫిక్ రీసెర్చ్‌‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో రామచంద్ర.. రూ. 6000 కోట్లతో స్వదేశంలో ఓ ట్రస్టును నెలకొల్పాలనుకుంటాడు. దీంతో తన కుటుంబంతో కలిసి శ్రీవల్లి ఇండియాకు తిరిగొస్తుంది. కానీ, అనుకోకుండా జరిగిన ఓ యాక్సిడెంట్ కారణంగా.. శ్రీవల్లి తండ్రి దుర్మరణం పాలవుతాడు. ఆమె సోదరుడు కోమాలోకి వెళ్లిపోతాడు. 


ఇదే సమయంలో శ్రీవల్లి తన ప్రొఫెసర్‌‌తో కలిసి ఓ ‘బ్రెయిన్ మ్యాపింగ్’ ప్రయోగం చేస్తుంది. భావోద్వేగాలు, జ్ఞాపకాలకు కారణమైన మెదడులోని ప్రధాన భాగాన్ని కనిపెట్టి.. దాని నుంచి జనించే ప్రత్యేక తరంగాల ద్వారా మరొక వ్యక్తి మెదడుకు అనుసంధానమవడం ఆ ప్రయోగం ప్రధాన లక్ష్యం. తన సోదరుణ్ని కోమా నుంచి బయటకి తీసుకురావాలనే ప్రధాన ఉద్దేశంతో ఆమె ఈ ప్రయోగానికి సిద్ధమవుతుంది. కానీ, ఆ ప్రయోగం వికటించి అనూహ్యంగా ఆమెకు గత జన్మ జ్ఞాపకాలు గుర్తొస్తాయి. 


గత జన్మలో శ్రీవల్లిని ఓ వ్యక్తి అమితంగా ఆరాధిస్తుంటాడు. అతడు చూపే ప్రేమకు తీయని అనుభూతే చెందే శ్రీవల్లి.. తన మన్మథుడి రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇదే సమయంలో అమెరికాలో తన క్లాస్‌మేట్ అయిన ఆండ్రియా.. స్వలింగ సంపర్కం కోసం శ్రీవల్లిని బాగా ఒత్తిడి చేస్తుంది. దీంతో శ్రీవల్లి.. ఏది కలో.. ఏది నిజమో గ్రహించలేని ఒక ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్లిపోతుంది. ఆమె తన స్నేహితుడు గౌతమ్‌తో కొన్ని విషయాలు పంచుకోవడంతో కథ ఆసక్తికర మలుపు తిరుగుతుంది. మరి శ్రీవల్లి ఆ మానసిక వేధన నుంచి బయటపడిందా? తన ప్రయోగం ద్వారా లక్ష్యాన్ని చేరుకుందా? తన సోదరుణ్ని ప్రాణాపాయం నుంచి కాపాడిందా? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 


విశ్లేషణ: వేర్వేరు ప్రాంతాల్లో.. ఎంతో ఎడంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు కొన్నిసార్లు ఒకరి గురించి మరొకరు ఒకేవిధంగా ఆలోచిస్తారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? వాళ్ల మెదళ్ల మధ్య శబ్ద తరంగాలు ఎలా ప్రవహిస్తాయి? సైన్స్ దీనికేమైనా వివరణ ఇస్తుందా.. అనే పాయింట్ ఆధారంగా 'శ్రీవల్లి' సినిమా తెరకెక్కింది. ఈ నేపథ్యంలో సినిమా చాలా థ్రిల్లింగ్‌గా సాగింది. 


యితే.. తనదైన శైలిలో వైవిధ్యమైన కథ రాసుకున్న దర్శకుడు తెరపై దాన్ని అంతే అద్భుతంగా చూపెట్టడంలో నిరాశపరిచాడు. మంచి స్క్రీన్‌ప్లేతో పాటు సన్నివేశాలను మరింతగా రక్తికట్టిస్తే.. ఈ సినిమా స్థాయి మరోలా ఉండేది. సినిమాలో గ్రాఫిక్స్‌కు అవకాశాలు చాలానే ఉన్నా.. దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. బాహుబలి లాంటి సినిమాతో పోల్చి చూస్తే.. ఈ గ్రాఫిక్స్‌కు ఏమాత్రం విలువ లేదని తేలిగ్గానే అర్థమవుతుంది. 


 


శ్రీవల్లి పాత్రకు నేహ తగిన న్యాయం చేసింది. రజత్ కూడా తన నటనతో సంతృప్తి పరిచాడు. నిజానికి సినిమాలో ఇతడి పాత్రకు అంతగా ప్రాధాన్యం లేదు. మరోవైపు రాజీవ్ కనకాల ఈ సినిమాలో కనిపించేది చాలా తక్కువ సమయమే అయినా.. తనదైన మార్కు నటనతో మరచిపోలేనివిధంగా మెస్మరైజ్ చేశాడు. సినిమా ప్రారంభంలోనే రామచంద్ర మరణించినా.. చివరి వరకూ ఆ పాత్ర వెంటాడుతూనే ఉంటుంది. పాటలకు పెద్దగా స్థానంలేని సినిమా కావడంతో.. సంగీతం పర్వాలేదనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. కెమెరా పనితనం బాగుంది. ఏదేమైనా వైవిధ్య తరహా కథలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. 


ఇది చాలా చిన్న సినిమాయేగా అని చాలా మంది కొట్టిపారేయొచ్చు. కానీ, విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహించడంతో అంచనాలు అనూహ్యంగా పెరిగాయి. ఆ అంచనాలను అందుకోవడంలో దర్శకుడిగా ఆయన విఫలమయ్యారనే చెప్పొచ్చు. మొత్తం మీద ‘శ్రీవల్లి’ ఒక వినూత్న ప్రయత్నం.. కానీ, ఇదొక విఫలమైన ప్రయోగం. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com