క్యాబ్ డ్రైవర్‌తో 'గురు' హీరోయిన్ కొత్త కథ!

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 12, 2017, 08:17 AM
 

విక్టరీ వెంకటేష్ 'గురు' చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది రితికా సింగ్. ఆ సినిమాలో రితికా నటనకు ప్రేక్షకులు ఫుల్ ఫిదా అయ్యారు. ఆ తరువాత ఆమె నటించిన 'శివలింగ' చిత్రానికి కూడా ప్రేక్షకాదరణ లభించింది. ఇలా రెండు వైవిధ్యమైన పాత్రలతో తెలుగు వారికి దగ్గరైంది ఈ బ్యూటీ. ఇప్పుడు మరో కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది.


ఇప్పటికే తమిళ చిత్రాలను లైన్‌లో పెట్టిన రితికా ఇటీవల ఓ తెలుగు సినిమా కమిట్ అయినట్లుగా తెలుస్తోంది. ఇదొక వైవిధ్య కథాంశంతో కూడుకున్నదని తెలుస్తోంది. సినిమాలో రితికా సింగ్‌తో పాటు మరో ముఖ్య పాత్రలో నటుడు ఉత్తేజ్ కనిపించనున్నాడు. క్యాబ్ డ్రైవర్ పాత్రలో ఉత్తేజ్ కనిపిస్తాడని సమాచారం. ఉత్తేజ్ భార్య పాత్రలో నటి మాధవీ లతా నటించనుంది. వారిద్దరికి సినిమాలో ఓ కొడుకు కూడా ఉంటాడట. ఓ క్యాబ్ డ్రైవర్‌కు అమ్మాయికి ఎదురయ్యే ఓ ఇన్సిడెంట్‌తో కథ మొదలవుతుందని తెలుస్తోంది.


సినిమా మొత్తం ఉత్తేజ్, రితికా సింగ్‌ల చుట్టూ తిరుగుతుందట. మరోవైపు ఈ మూవీలో రితికా కూడా క్యాబ్ డ్రైవర్‌గానే నటిస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. ఇదిలాఉంటే చాలా కాలం తరువాత ఉత్తేజ్‌కు సినిమాలో ప్రధాన పాత్ర దక్కడంతో ఈ సినిమా తరువాత తనకు మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తున్నాడు. అలానే రితికా కూడా ఈ సినిమాతో నటిగా మంచి గుర్తింపు లభిస్తుందనే నమ్మకంతో ఉంది. ఓ కొత్త దర్శకుడు ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు.
Recent Post