ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హీరోలే నిర్మాత‌లు.. న‌యా ట్రెండ్!!

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 19, 2019, 06:39 PM



సినిమాల నిర్మాణంలో భాగం పంచుకోవ‌డం అన్న‌ది హీరోల‌కు తొలి నుంచి అల‌వాటు వ్యాప‌క‌మే. భారీ బ‌డ్జెట్ల‌తో తెర‌కెక్కే చిత్రాల‌కు రిస్క్ ఫ్యాక్ట‌ర్ త‌గ్గించేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఇలాంటి ఒప్పందాల‌కు ఓకే చెబుతుంటారు. బ‌డ్జెట్ బాధ్య‌త‌ను నేర్పుతుంది కాబ‌ట్టి.. అది మేక‌ర్స్ కి ప్ల‌స్ అయ్యే విష‌య‌మే. అయితే ఈరోజుల్లో హీరోలే నిర్మాత‌లుగా మారుతూ ఇండ‌స్ట్రీని శాసించే ప్ర‌య‌త్నం చేయ‌డం కొత్త ప‌రిణామం. ఒక‌ప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్‌, కృష్ణ వంటి అగ్ర హీరోలు సొంత బ్యాన‌ర్ల‌లో సినిమాలు నిర్మించారు. చిరంజీవికి గీతా ఆర్ట్స్ అండ‌దండ‌లు ఉన్నాయి. నాగార్జున‌కు అన్న‌పూర్ణ స్టూడియోస్, వెంక‌టేష్ కి సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, మోహ‌న్ బాబుకు ఎంబీ ప్రొడ‌క్ష‌న్స్, ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ వంటి బ్యాన‌ర్లు అండ‌గా ఉండేవి.
అయితే ఈ త‌రం హీరోలు ఎవ‌రికి వారు సొంతంగా బ్యాన‌ర్లు స్థాపించి టాలీవుడ్ లో త‌మ‌కంటూ ఓ కాంపౌండ్ ని నిర్మించుకునే ఆలోచ‌న స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు స్టార్ హీరోలు బ్యాన‌ర్లు స్థాపించి సినిమాలు తీస్తున్నారు. బ‌య‌ట బ్యాన‌ర్ల‌కు న‌టిస్తూనే సొంత బ్యాన‌ర్ల‌లో సినిమాలు తీస్తున్నారు. హీరో రామ్ చ‌ర‌ణ్ కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీలో డాడ్ చిరంజీవి హీరోగా సినిమాలు నిర్మిస్తున్నారు. సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఎంబీ ప్రొడ‌క్ష‌న్స్ స్థాపించి అందులో సినిమాలు, వెబ్ సిరీస్ లు నిర్మించ‌డం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ లో క‌ల్యాణ్ రామ్ సినిమాలు నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. బ‌న్ని సొంత బ్యాన‌ర్ ప్రారంభించే ఆలోచ‌న‌లో ఉన్నారు. అలాగే ఎన్టీఆర్ ఇక‌పై ఆలోచించే వీలుంద‌ని తెలుస్తోంది.
యువ‌హీరో నితిన్ తండ్రి వార‌స‌త్వాన్ని అందిపుచ్చుకుని నిర్మాత‌గా మారిన సంగతి తెలిసిందే. నాని డి ఫ‌ర్ దోపిడి అనే సినిమాకి స‌హ నిర్మాత‌. త‌ర్వాత‌ సొంత బ్యాన‌ర్ లో `అ!` అనే చిత్రం నిర్మించి ఇప్పుడు వేరొక చిత్రానికి స‌న్నాహ‌కాలు చేస్తున్నారు. సుధీర్ బాబు గ‌త ఏడాది సొంత బ్యాన‌ర్ ఎస్‌బి ప్రొడ‌క్ష‌న్స్ ప్రారంభించి అందులో ఓ చిత్రం నిర్మించారు. త‌దుప‌రి మ‌రిన్ని చిత్రాల నిర్మాణానికి స‌న్నాహాలు చేస్తున్నారు. నారా రోహిత్ సైతం సొంత ప్రొడ‌క్ష‌న్ ర‌న్ చేస్తున్నారు. విజ‌య్‌ దేవ‌ర‌కొండ సొంతంగా `కింగ్ ఆఫ్ ది హిల్‌` అనే బ్యాన‌ర్ ప్రారంభించి నోటా చిత్రానికి స‌హ‌నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌స్తుతం ఇందులో ప‌లు చిత్రాలు నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. నారా రోహిత్ సొంతంగా బ్యాన‌ర్ ప్రారంభించి స్నేహితుల‌తో క‌లిసి సినిమాలు నిర్మిస్తున్నారు. ఇక ఇటీవ‌లే ఎన్‌బికే ప్రొడ‌క్ష‌న్స్ ప్రారంభించి నంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు చిత్రాల్ని నిర్మించిన సంగ‌తి తెలిసిందే.
అయితే ఇలా మొద‌లైన బ్యాన‌ర్లు స‌క్సెస్ బాట‌లో న‌డ‌వ‌డం అన్న‌ది చాలా ఫ్యాక్ట‌ర్స్ పై ఆధార‌ప‌డి ఉంటుంది. న‌ష్టానికి కుంగిపోకూడ‌దు.. లాభం వ‌స్తే ఆకాశానికి నిచ్చెన వేసేయ‌కూడ‌దు. బ్యాలెన్స్ డ్ గా సినిమాలు చేస్తేనే లాంగ్ ర‌న్ ఉంటుంద‌ని విశ్లేషిస్తున్నారు. ఇక మెజారిటీ పార్ట్ హీరోలు నిర్మాత‌లు అయ్యి చేతులు కాల్చుకున్న సంద‌ర్భాలే ఎక్కువ‌. లాభాలు తీయ‌డంలో అనుభ‌వం ఘ‌డించే వ‌ర‌కూ దెబ్బ తిన్న‌వారే ఎక్కువ‌.


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com