ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సినీ స‌వ్య‌సాచి డా..యం.ప్ర‌భాక‌ర్ రెడ్డి

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 19, 2019, 06:46 PM



నూరేళ్ళ తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ ఎదుగుద‌ల వెన‌క ఎంద‌రో మ‌హానుభావుల అలుపెరుగ‌ని కృషి ఉంది. నేటి మ‌న ఆధునిక తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌, ప‌ద‌మూడు వేల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చుపెట్టి సినిమా రూపొందించే స్థాయికి ఎదిగింది. దీని వెనుక ఎంద‌రో మ‌హా మ‌హుల నిరంత‌ర కృషి క‌ఠోర శ్ర‌మ ఉంది. ఈ విధంగా దిన‌దినాభివృద్ధి చెంది ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌ద‌నాన్ని ఆపాదించుకున్న తెలుగు సినిమా ఎదుగుద‌ల వెనుక తెలంగాణ ప్రాంతానికి చెందిన సినీ ప్ర‌ముఖులు కూడా చాలా మంది ఉన్నారు. వారు తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చేసిన కృషి మ‌ర‌చిపోలేనిది.
ఆబాల‌గోపాలాన్ని అల‌రించే సినిమాల‌ని, అవార్డ్ సినిమాల‌ని, అన్ని వ‌ర్గాల‌వారిని అబ్బుర‌ప‌రిచే సినిమాల‌ని, ఆనందంతో తృప్తి ప‌రిచే సినిమాల‌ని ఎన్నింటినో మ‌న‌వాళ్లు తెర‌కెక్కించారు. అలాంటి మ‌రువ‌లేని, వేరెవ‌రికి సాటిరాని మేటి సినిమాల‌ను వెండితెర‌కు అందించిన ద‌ర్శ‌క‌నిర్మాత‌, ర‌చ‌యిత‌, మంచి న‌టుడు డా..యం.ప్ర‌భాక‌ర్‌రెడ్డిని గుర్తు చేసుకోవ‌డం, ఆయ‌న తెలుగు చ‌ల‌న‌చిత్ర రంగానికి చేసిన కృషి గురించి చెప్పుకోవ‌డం నాటి త‌రంతో పాటు భావిత‌రానికి చాలా అవ‌స‌రం.
472 సినిమాల్లో న‌టుడిగా, వైవిధ్య‌భ‌రిత న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించి, 21 సినిమాల‌కు క‌థా ర‌చ‌యిత‌గా అద్భుత క‌థ‌ల‌ను అందించి, తెలుగు చ‌ల‌న‌చిత్ర రంగానికి ఎన్నో అద్భుత‌మైన చిత్రాల‌కు నిర్మాత‌గా అందించి, హైద‌రాబాద్‌లో చ‌ల‌న‌చిత్ర రంగం స్థిర‌ప‌డ‌టానికి వెన్నెముక వంటి ప్రాధాన్య‌త‌ను నిర్వ‌ర్తించిన డా..యం.ప్ర‌భాక‌ర్‌రెడ్డి తెలుగు చిత్ర రంగంలో నిజ‌మైన స‌వ్య‌సాచి, అజాత‌శ‌త్రువు.
డా..యం.ప్ర‌భాక‌ర్‌రెడ్డి పూర్తి పేరు మందాడి ప్ర‌భాక‌ర్‌రెడ్డి. 1935 అక్టోబ‌ర్ 8వ తేదీన మందాడ ల‌క్ష్మారెడ్డి, కౌస‌ల్య దంప‌తుల‌కు ఆయ‌న జన్మించారు. తెలంగాణ సినీ ర‌త్నం ప్ర‌భాక‌ర్‌రెడ్డి. ఆయన స్వ‌స్థ‌లం న‌ల్గొండ జిల్లా కేత‌ప‌ల్లి మండ‌లంలోని తుంగ‌తుర్తి అనే గ్రామం. తుంగ‌తుర్తిలో జ‌న్మించిన ఆయ‌న సూర్యాపేట‌లో త‌న ప్రాథ‌మిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. త‌రువాత ఇంట‌ర్మీడియ‌ట్‌ని హైద‌రాబాద్ సిటీ కాలేజ్‌లో, ఆ త‌రువాత పూర్త‌వ‌గానే సినిమాల మీద దృష్టి సారించిన ఆయ‌న అదే సంవ‌త్స‌రం సినీ ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టారు. గుత్తారామినీడు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చివ‌ర‌కు మిగిలేది  సినిమా ద్వారా న‌టుడిగా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన డా..ప్ర‌భాకార్‌రెడ్డి ఆ త‌రువాత వ‌రుస‌గా వైవిధ్య భ‌రిత‌మైన పాత్రల్లో సినిమాల‌లో న‌టిసూ్త త‌న‌దైన బాణీలో ముందుకు దూసుకుపోయారు. ఆయ‌న న‌టించిన రెండ‌వ చిత్రం పాండ‌వ వ‌న‌వాసం. అందులో క‌ర్ణుడి పాత్ర‌లో ర‌స‌జ్ఞుల‌ను మెప్పించినఆయ‌న ఆ త‌రువాత శాంత‌న‌పుడిగా, శివుడిఆ, పోలీస్ ఇన్స్‌పెక్ట‌ర్‌గా వైవిధ్య భ‌రిత‌మైన సాంఘిక‌, పౌరాణిక‌, చారిత్రాత్మ‌క పాత్ర‌ల‌ను పోషించారు. దాన‌వీర‌శూర‌క‌ర్ణ‌లో ధ‌ర్మ‌రాజుగా, గృహ‌ప్ర‌వేశం సినిమాలో త‌న జులాయి త‌నంతో వ్య‌స‌న‌ప‌రుడైన కొడుక్కి తండ్రిగా, గ‌య్యాళి భార్య‌కి అమాయ‌క భ‌ర్త‌గా ఆయ‌న ప్ర‌ద‌ర్శించిన న‌ట‌న అంద‌రినీ ఆక‌ట్టుకుంది. న‌టుడిగా ఆయ‌న మొత్తం 472 సినిమాల‌లో విభిన్న పాత్ర‌లు పోషించారు.
1960లో వ‌చ్చిన చివ‌ర‌కు మిగిలేది చిత్రం ఆయ‌న న‌టించిన మొద‌టి చిత్రం. అలాగే 1990లో వ‌చ్చిన చిన్న‌కోడ‌లు సినిమా ఆయ‌న న‌టించిన చివ‌రి చిత్రం. భీష్మ‌, మ‌హామంత‌రి తిమ్మ‌రుసు, న‌ర్త‌న‌శాల‌, పున‌ర్జ‌న్మ‌, శ్రీ‌కృష్ణార్జున‌యుద్ధం, బొబ్బిలి యుద్ధం, ప‌ల్నాటి యుద్ధం, శ్రీ‌కృష్ణావ‌తారం, బందిపోటు దొంగ‌లు, బ్ర‌హ్మ‌చారి, ఆత్మీయులు, ఉమ్మ‌డి కుటుంబం, భ‌లే త‌మ్ముడు, ల‌క్ష్మీ క‌టాక్షం, మ‌ట్టిలో మాణిక్యం, పండంటి కాపురం, పాపం ప‌సివాడు, శ్రీ‌కృష్ణ విజ‌యం, మాయదారి మ‌ల్లిగాడు, అల్లూరి సీతారామ‌రాజు, భ‌క్త‌క‌న్న‌ప్ప‌, దార‌వీర శూర‌క‌ర్ణ‌, క‌ట‌క‌టాల రుద్ర‌య్య వంటి వంద‌లాది విజ‌య‌వంత‌మైన చిత్రాల‌లో న‌టించిన ఆయ‌న ఎన్నో మ‌ర‌పురాని పాత్ర‌ల‌ని పోషించి వాటికి వ‌న్నె తెచ్చారు. తాను పోషించిన ప్త‌రి పాత్ర‌కి త‌న‌దైన శైలితో ముద్ర వేసిన ఆయ‌న కోట్లాది ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తోపాటు ఎన్నో పుర‌స్కారాల్ని అందుకున్నాడు. ఉత్త‌మ న‌టుడిగా మూడు సార్లు నంది అవార్డులు సైతం అందుకున్నాడు. అశేష ప్ర‌జానికాన్ని త‌న న‌ట‌న‌తో అల‌రించిన ఆయ‌న ర‌చ‌యిత‌గా కూడా అదే స్థాయిలో ప్ర‌జ‌ల హృద‌యాల‌ను కొల్ల‌గొట్టాడు. ర‌చ‌యితా ఎన్నెన్నో మంచి సినిమాల‌కి క‌థ‌లు అందించాడు. ఆ సినిమాలు విజ‌య‌వంతం కావ‌డానికి ఆయ‌న అందించిన బ‌ల‌మైన క‌థ‌లు ఎంత‌గానో తోడ్ప‌డ్డాయి. సామాజిక విష‌యాల్ని, సామాన్య‌మైన సున్నిత‌మైన‌, కుటుంబ వ్య‌వ‌హారాల్ని, క‌థా వ‌స్తువులుగా తీసుకుని ఆయ‌న మ‌లిచిన క‌థ‌లు, న‌డిపించిన క‌థ‌నాలు ప్ర‌జ‌ల గుండెల్లో చిర‌స్థాయిగా నేటికీ నిలిచిపోయాయి. పండంటి కాపురం, పచ్చ‌ని సంసారం, గృహ‌ప్ర‌వేశం వంటి కుటుంబ క‌థా చిత్రాలు, ధ‌ర్మాత్ముడు, నాఊ సా్వ‌తంత్యం వ‌చ్చింది, గాంధీ పుట్టిన దేశం వంటి సందేశాత్మ‌క చిత్రాలు ఆయ‌న ర‌చ‌నా కౌశ‌లాన్ని మ‌న‌కు తెలియ‌జేస్తాయి. ఆయ‌న రాసిన కార్తీక దీపం, గృహ‌ప్ర‌వేశం చిత్రాలు ఎంత‌టి ఘ‌న విజ‌యం సాధించాయో అంద‌రికీ తెలుసు. న‌టుడిగా, ర‌చ‌యిత‌గా ఎన్నో మైలురాళ్ళ‌ను సృష్టించిన ఆయ‌న అందుకున్న స‌త్కారాల‌కు, పొందిన పుర‌స్కారాల‌కు లెక్క‌లేదు.
1972లో పండంటి కాపురం చిత్రానికి  జాతీయ ఉత్త‌మ తెలుగు చిత్రం అవార్డును ఆయ‌న అందుకున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ద్వారా మొత్తం 5 నుంచి పుర‌స్కారాల్ని ఆయ‌న అందుకున్నారు. అందులో మూడు న‌ట‌న‌కు ప‌ట్టం క‌ట్టిన‌వ‌యితే, మిగిలిన ఎండు ఆయ‌న ర‌చ‌నా న‌టిమ‌కి ఉత్త‌మ ర‌చ‌యిత‌గా ఆయ‌న‌కు ద‌క్కాయి. న‌టుడిగా ర‌చ‌యిత‌గా త‌న స‌త్తాను నిరూపించుకున్న ఆయ‌న ద‌ర్శ‌కుడిగా చేసిన తొలి ప్ర‌య‌త్నం 1996లో వ‌చ్చిన కామ్రేడ్ అనే చిత్రం.
1976లో భూమికోసం అనే  చిత్రంలోని ఒక పాట‌తో ల‌లితారాణిగా సినీప‌రిశ్ర‌మ‌లోకి సాదాసీదాగా ప్ర‌వేశించిన న‌టికి జ‌య‌ప్ర‌ద‌గా నామ‌క‌ర‌ణం చేసి, తెలుగు చిత్ర సీమ‌కు ఒక అంద‌మైన‌, అద్భుమైన న‌టిని ప‌రిచ‌యం చేసిన ఘ‌న‌త ప్ర‌భాక‌ర్‌రెడి్డ‌గారికే ద‌క్కుతుంది. తాను నిరంత‌రం కృషి చేస్తూ చ‌ల‌న‌చిత్ర రంగంలో ఎన్నో హిమ శిఖ‌రాల్ని అధిరోహిస్తూనే ఎంతోమంది జౌత్సాహికుల‌కు, నూత‌న న‌టీన‌టుల‌కు ప్రోత్సాహం అందించి అవ‌కాశాలు ఇప్పించిన మాన‌వ‌తామూర్తి ప్ర‌భాక‌ర్‌రెడ్డి. త‌న చెంత‌కు సాయం కోసం వ‌చ్చిన‌వారికి ఏదో ఒక సాయం చేయ‌టం ఆయ‌న నిపుణులు ఉన్న‌త‌స్ధాయికి ఎదిగారు. వారి ఎదుగుద‌ల‌ను చూసి ఆయ‌న గ‌ర్వ‌ప‌డేవారేకానీ ఏనాడూ ఈర్ష్య‌ప‌డ‌లేదు.
తెలుగు చ‌ల‌న చిత్ర రంగం హైద‌రాబాద్‌లో స్థిర‌ప‌డ‌టానికి ఆయ‌న ఎన‌లేని కృషి చేశారు. నాటి ముఖ్య‌మంత్రి డా..మ‌ర్రి చెన్నారెడ్డిగారితో ఉన్న సాన్నిహిత్యం వ‌ల్ల ప‌రిశ్ర‌మ ప‌క్కాగా స్థిర‌ప‌డ‌టానికి ఎన్నెన్నో రాయితీల్ని వెసులుబాటుని ప్ర‌భుత్వం నుంచి సాధించిన ప్ర‌తిభాశాతి ప్ర‌భాక‌ర‌రెడ్డి.
ఎన్ని విజ‌యాలు! ఎన్ని మైలు రాళ్ళు!
ఎన్ని గెలుపులు! ఎన్ని ప్రోత్సాహ‌కాలు!
ఎన్ని అవార్డులు! ఎన్ని రివార్డులు!
అన్నీ ఆయ‌న్ని కోరి వ‌రించిన‌వే.
మూడు ద‌శాబ్దాల‌పాటు వెండి తెర పై గొప్ప‌న‌టుడిగా వెలిఇన ఆయ‌న 1997లో మ‌ర‌ణించారు. ఆ మ‌హ‌నీయుని గౌర‌వార్థం తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ మ‌ణికొండ‌లో నిర్మించిన కార్మిక నివాస క్షేత్రానికి డా..యం.ప్ర‌భాక‌ర్‌రెడ్డి చ‌ల‌న‌చిత్ర కార్మిక చిత్ర‌పురిగా నామ‌క‌ర‌ణం చేశారు. ప్ర‌భాక‌ర్‌రెడ్డిగారిలాంటి మ‌హానుభావులు సాధించిన విజ‌యాలు నేటిత‌రం ఔత్సాహాకుల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు. వారు చేసిన కృసి నుండి నేటి యువ‌త‌రం విజ‌యాల‌ను సాధించ‌డానికి చేయాల్సిన కృషి, దానికి కావాల్సిన ప‌ట్టుద‌ల అవ‌లంభించ‌వ‌ల‌సిన విధి విధానాల‌ను నేర్చుకోవాలి. నేటిత‌రం వారు త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన గొప్ప వ్య‌క్తి, ఆద‌ర్శ‌మూర్తి, మార్గ‌ద‌ర్శి డా..యం. ప్ర‌భాక‌ర్‌రెడ్డి.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com