ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోడి రామకృష్ణకు బ్యాండ్, తాళ్ళు, ఉంగరాలు ఎందుకు?

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 22, 2019, 08:08 PM



తెలుగు సినిమా గర్వించదగ్గ దర్శకుడు కోడి రామకృష్ణ. ఆయన మరణం టాలీవుడ్‌కు తీరని లోటు అనే చెప్పుకోవచ్చు. వంద చిత్రాల పైననే దర్శకత్వం వహించారు. దర్శకరత్న దాసరి నారాయణరావు దగ్గర దర్శకత్వ శాఖలో చేరి ఆయనకు ప్రియ శిష్యుడు అయ్యారు. ఆ తర్వాత దర్శకుడిగా వచ్చి విరామం లేకుండా ఎన్నో మరుపురాని సినిమాలను రూపొందించారు. ఆయన ఇకలేరని చెప్పడం అత్యంత బాధాకరమైన విషయం అని టాలీవుడ్ యావత్తు అంటోంది. కోడి రామకృష్ణ అనగానే మనకు నుదురుకు బ్యాండ్ చుట్టుకుని, బొట్టు పెట్టుకుని, చేతులకు తాళ్లు, వేళ్లకు ఉంగరాలు ధరించి వుంటారు. అలా వుండటం ఆయన సెంటిమెంటో ఏంటోగానీ అవన్నీ ఆయనకంటూ ఓ ప్రత్యేకతని తీసుకువచ్చాయి.
నుదిటిపైకి ఈ బ్యాండ్‌ ఎలా వచ్చిందనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘పోలీసులకు టోపీ, రైతుకు తలపాగా ఏలాగో నాకు ఈ బ్యాండ్ అలాంటిదే. దీన్ని చాలా పవిత్రంగా చూసుకుంటాను. దర్శకుడిగా నా రెండో సినిమా షూటింగ్‌ కోవలం బీచ్‌ దగ్గర జరుగుతోంది. మిట్ట మధ్యాహ్నం పూట ఎండ చాలా ఎక్కువగా వుంది. అప్పుడు ఎన్టీఆర్ గారి కాస్ట్యూమర్‌ మోకా రామారావుగారు నా దగ్గరకు వచ్చారు. మీ నుదురు విశాలంగా ఉంది. ఎండ ఎక్స్‌పోజర్‌ అవుతుందంటూ ఒక జేబు రుమాలు ఇచ్చి కట్టుకోమన్నారు, కట్టుకున్నా. మర్నాడు బ్యాండ్‌లా తయారు చేసుకుని తెచ్చారు. దీనికి మీకు ఏదో బంధం ఉంది.. అందరికీ మ్యాచ్‌ అవ్వదు. మీకు బాగా సూటయింది. దీన్ని కట్టుకోకుండా ఉండొద్దని అన్నారు. ఇక అప్పట్నుంచి షూటింగ్‌ టైమ్‌లో బ్యాండ్‌ కట్టుకోవడం సెంటిమెంట్‌ అయిపోయింది. అదే నాకు ఐడెంటిటిగా మారిపోయింది‘ అని చెప్పారు.
ఉంగరాలు, తాళ్ళ గురించి మాట్లాడుతూ.. ‘నా చిన్నప్పుడు తెల్లవారుజామున నాలుగు గంటలకే పెద్ద కాలువకు తీసుకెళ్లి స్నానం చేయించేది మా అమ్మ. అట్నుంచి అటే గుడికి వెళ్లేవాళ్లం. ఒకసారి కాలువ దగ్గర మా అమ్మ బట్టలు ఉతుకుతుంటే.. నేనక్కడే ఆడుకుంటున్నా. ఇంతలో ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడిపోయా. ఒకతను నన్ను కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చాడు. ఆ సంఘటనతో అమ్మ బోరున ఏడ్చేసింది. అదే బాధలో నన్ను విపరీతంగా కొట్టేసింది. వెంటనే గుడికి తీసుకెళ్లి పూజ చేయించింది. ఇప్పట్నుంచి దేవుణ్ణే నమ్ముకో. నీ కడుపు నిండుగా ఉండాలి. మళ్లీ నీకు పుట్టాలిగా అన్నది. అప్పట్నుంచి అమ్మ మాటలను ఫాలో అవుతున్నాను. ఇది సెంటిమెంటల్‌ టచ్‌. మా అమ్మవల్లే నాకు భక్తి ఏర్పడింది. నా చిత్రాల్లో ఎక్కువగా భక్తిరస చిత్రాలు వుండటానికి పునాది మా అమ్మ నుంచే పడింది. ఏ స్వామి వచ్చినా నా చేతికి ఇలా కంకణాలు కడుతుంటారు. నా మేలు కోరి పూజించి కడుతుంటారు. ఏదైనా తాడు తెగిపోయినా, నాకు నేనే తీసేసుకున్నా.. అరగంటలో ఇంకొక స్వామి ఎవరో వచ్చి మరో తాడు కడతారు. అంతా నమ్మకమే’ అని వివరించారాయన.
ఉంగరాల గురించి చెప్తూ.. తన మొదటి సినిమా 500 రోజులు ఆడింది. కానీ తర్వాత సినిమాకు ఆఫర్ రాలేదు. అప్పుడు ‘మురుగా రెండో సినిమా కూడా హిట్‌ అయితే నీ ఉంగరం పెట్టుకుంటాను’ అని మొక్కుకున్నా. అదృష్టవశాత్తు  రెండో సినిమా కూడా పెద్ద హిట్‌ అయింది. అప్పుడు తన ఊళ్లో మురుగన్‌ ఉంగరం చేయించుకుని ధరిస్తున్నానని అన్నారు. తన గ్రహస్థితిని బట్టి ఫలానా ఉంగరం పెట్టుకోమని సూచిస్తుంటారు వాళ్లు. అలా ఉంగరాలు అలవాటైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com