ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘రాజా ది గ్రేట్’సినిమా రివ్యూ

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 18, 2017, 02:44 PM



మాస్ ప్రేక్షకుల్లో రవితేజకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలు కూడా మాస్‌కు తగ్గట్టుగానే ఉంటాయి. ‘కిక్ 2’, ‘బెంగాల్ టైగర్’ సినిమాల తర్వాత చాలా విరామం తీసుకుని ఇప్పుడు ‘రాజా ది గ్రేట్’ అంటూ వచ్చాడు మాస్ మహారాజా. ఇప్పటి వరకు ఎప్పుడూ చేయని అంధుడి పాత్రలో రవితేజ కొత్తగా కనిపించాడు. దీపావళి సందర్భంగా బుధవారం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేర మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం! 


కథ:  దేవరాజ్(వివన్ భతేనా) భువనగిరి ప్రాంతాన్ని తన అడ్డాగా చేసుకొని రౌడీయిజం చేస్తుంటాడు. రాజకీయాల్లో ఎదగాలనేది అతడి కల. దేవరాజ్‌కు తమ్ముడంటే ప్రాణం. ప్రకాష్(ప్రకాష్ రాజ్) అనే పోలీస్ ఆఫీసర్ దేవరాజ్ తమ్ముడిని కాల్చి చంపేస్తాడు. దీంతో పగ బట్టిన దేవరాజ్.. ప్రకాష్ కూతురు లక్కీ(మెహ్రీన్)ని కిడ్నాప్ చేస్తాడు. కూతురిని కాపాడుకునే ప్రయత్నంలో ప్రకాష్ ప్రాణాలు కోల్పోతాడు. లక్కీ ఆ రౌడీల నుంచి తప్పించుకొని వెళ్లిపోతుంది. లక్కీ ప్రాణాలకు ముప్పు ఉందని తెలుసుకున్న పోలీసులు ఆమెను కాపాడేందకు సీక్రెట్ మిషన్ చేపడతారు. 





ఇదిలా ఉంటే.. రాజా(రవితేజ) పుట్టుకతో అంధుడు. హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసే రాజా తల్లి అనంతలక్ష్మి(రాధిక) అతడిని పోలీస్ ఆఫీసర్‌గా చూడాలని కలలు కంటుంది. అయితే లక్కీని కాపాడే మిషన్‌లో అనంతలక్ష్మి కూడా ఉంటుంది. ఈ మిషన్ కోసం రాజా తన తల్లికి సహాయపడతాడు. ఆ తరువాత ఏం జరిగింది..? అంధుడైన రాజా.. లక్కీని ఎలా కాపాడతాడు..? దేవరాజ్ తన పగను తీర్చుకున్నాడా..? రాజా చివరకు పోలీస్ అయ్యాడా..? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే! 


విశ్లేషణ: తన పగ తీర్చుకోవడం కోసం అమ్మాయిని చంపాలనుకునే విలన్, అతడిని మట్టి కరిపించి ఆ అమ్మాయిని కాపాడాలనుకునే ఒక అంధుడు.. చివరకు వీరి జీవితాలు ఎలాంటి మలుపులు తీసుకున్నాయనే లైన్‌తో ఈ కథను అల్లేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. నిజానికి కథలో అంత కంటెంట్ లేకపోయినా.. తన కామెడీ డైలాగ్స్, ఎంటర్‌టైన్మెంట్‌తో సినిమా నడిపించే ప్రయత్నం చేశాడు. ఆ విషయంలో కొంతవరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. సినిమా మొదటిభాగం హీరోయిన్ తన తండ్రిని పోగొట్టుకొని బాధ పడడం, విలన్ నేపథ్యం, హీరో పరిచయం, రెండు మూడు కామెడీ సన్నివేశాలు, మరో రెండు పాటలు ఇలా రొటీన్‌గా సాగిపోయింది. 


సన్నివేశాలు ఒకదాని తరువాత ఒకటి పేర్చినట్లుగా ఉన్నాయే తప్ప స్క్రీన్ ప్లే పకడ్బంధీగా లేదు. దర్శకుడు కామెడీ మీద పెట్టిన దృష్టి కథ, కథనాల మీద పెట్టలేదనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ ఊహాజనితంగా ఉంటుంది. ప్రతి సీన్ తరువాత ఏం జరగబోతుందో.. ప్రేక్షకుల ఊహకు తెలిసిపోతుంది. ఇక పతాక సన్నివేశాలను మరింత సాగదీసి చూపించారు. అయితే ఇలాంటి కథను కూడా రవితేజ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్‌తో మరో స్థాయికి తీసుకెళ్లారు. ప్రేక్షకుడి దృష్టి రవితేజ నుంచి మరో నటుడి మీదకు వెళ్లదు. అంతగా రవితేజ తన నటనతో మెస్మరైజ్ చేశాడు. అంధుడిగా అతని నటన అధ్బుతమనే చెప్పాలి. 


రవితేజ చిన్నప్పటి పాత్రలో కనిపించిన ఆయన కొడుకు మహాధన్ కూడా బాగా నటించాడు. మెహ్రీన్ తన అందంతో, అభినయంతో ఆకట్టుకుంది. తండ్రిని పోగొట్టుకొని బాధ పడే సన్నివేశాల్లో బాగా నటించింది. వివన్ ప్రతినాయకుడి పాత్రలో ఒదిగిపోయాడు. టాలీవుడ్‌కు మరో స్టైలిష్ విలన్ దొరికాడనే చెప్పాలి. తల్లి పాత్రలో రాధిక అద్భుత నటన కనబరిచింది. సెకండ్ హాఫ్‌లో ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంది. శ్రీనివాస్ రెడ్డి.. సినిమా మొత్తం రవితేజ పక్కనే ఉంటూ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్ పోషించాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. 


తనికెళ్ళ భరణి పాత్ర కొత్తగా అనిపిస్తుంది. ఆడియన్స్‌ను నవ్విస్తుంది. ప్రకాష్ రాజ్, సంపత్, రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణమురలి తమ పాత్రల పరిధుల్లో బాగా నటించారు. టెక్నికల్‌గా సినిమా విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ వర్క్ ఆకట్టుకుంది. సాయి కార్తీక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు ఏవరేజ్‌గా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి రవితేజ నుంచి ప్రేక్షకులు ఆశించే పూర్తి ఎంటర్‌టైన్మెంట్ ఈ సినిమాలో ఉంటుంది. కథలో లాజిక్స్‌ను పక్కన పెడితే ఈ వీకెండ్ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయగలిగే పక్కా కమర్షియల్ మూవీ ‘రాజా ది గ్రేట్’. 


రేటింగ్: 3/5






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com