ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెక్ట్స్‌నువ్వే రివ్యూ

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 03, 2017, 03:14 PM



టాలీవుడ్‌లో కామెడీ, హారర్, థ్రిల్లర్ చిత్రాలకు ప్రేక్షకులు పెద్ద పీట వేస్తున్నారు. చిన్న చిత్రాలుగా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకొన్న హారర్ కామెడీ చిత్రాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వస్తున్న చిత్రం నెక్ట్స్ నువ్వే. బుల్లితెర మీద మెగాస్టార్‌‌గా పేరున్న ఈటీవీ ప్రభాకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.ప్రభాకర్ తొలిసారి దర్శకత్వం బాధ్యతలు చేపట్టి రూపొందించిన నెక్ట్స్ నువ్వే చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు బన్నీ వాసు, అల్లు అరవింద్, యూవీ క్రియేషన్ వంశీ తదితరులు నిర్మించారు. రష్మీ గౌతమ్, ఆది సాయికుమార్, అవసరాల శ్రీనివాస్ నటించిన చిత్రం నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న నెక్ట్స్ నువ్వే ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.


కథేంటంటే: కిరణ్‌(ఆది) ఒక సీరియల్‌ డైరెక్టర్‌. ‘జీవితం సేమ్యా ఉప్మా’ అనే సీరియల్‌ తీస్తాడు. ఆ సీరియల్‌ కోసం జేపీ(జయప్రకాష్‌రెడ్డి) వద్ద రూ.50లక్షలు అప్పు చేస్తాడు. ఆ సీరియల్‌ ఫ్లాప్‌ కావడంతో టెలివిజన్‌ వాళ్లు దాన్ని ఆపేస్తారు. దీంతో ఆది తీవ్రంగా నష్టపోతాడు. ‘వారం రోజుల్లో అప్పు చెల్లించకపోతే నీ లవర్‌(వైభవి)ని తీసుకెళ్తా’ అంటూ మరోపక్క జేపీ నుంచి బెదిరింపులు వస్తాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కిరణ్‌కు ఒక కొరియర్‌ వస్తుంది. అరకులో తనకో ప్యాలెస్‌ ఉందని, దానికి తానే యజమాని అన్న సంగతి ఆ కొరియర్‌ ద్వారా తెలుస్తుంది. దీంతో ఆ ప్యాలెస్‌ను వెతుక్కుంటూ వెళ్తాడు కిరణ్‌. ఈ సమయంలో శరత్‌(బ్రహ్మాజీ) రష్మి(రష్మి గౌతమ్‌) పరిచయం అవుతారు. ఈ నలుగురూ ఆ ప్యాలెస్‌ను బాగుచేసి దాన్నో రిసార్ట్‌లా తీర్చిదిద్దుతారు. అయితే అందులో అడుగు పెట్టిన వాళ్లంతా తెల్లవారేసరికి చనిపోతుంటారు. వాళ్లు ఎందుకు చనిపోతున్నారు? ఆ ప్యాలెస్‌ వెనక కథేంటి? అన్నదే సినిమా.


 


ఎలా ఉందంటే: తమిళంలో విజయం సాధించిన ‘యామిరుక్క భయమే’ రీమేక్‌ ఈ చిత్రం. గతంలో వచ్చిన హారర్‌ సినిమాల కోవలోనే ఇదీ కనిపిస్తుంది. కథలో ఎలాంటి కొత్తదనం లేదు. హారర్‌ థ్రిల్లర్‌ అని చెబుతున్నా, ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఆ వినోదం కూడా అక్కడక్కడా మాత్రమే పండింది. శరత్‌ పాత్రలో బ్రహ్మాజీ, ఆర్జీవీగా రఘుబాబు కామెడీని సినిమాకు ప్రధాన బలం. నవ్వులు పండించే బాధ్యత ఆ ఇద్దరే తీసుకున్నారు. ఈ కథలో దెయ్యం ఉందా? లేదా? ఉంటే ఎవరు? అనేది సినిమా ఇంకాసేపట్లో ముగుస్తుందనగా తెలుస్తుంది. అప్పటివరకూ కథలో పెద్దగా మలుపులు ఉండవు. భయపెట్టే సన్నివేశాలు కూడా తక్కువే. సినిమా కథ అంతా నాలుగు పాత్రల చుట్టూ తిరగడం.. ఒకే ప్యాలెస్‌కు పరిమితం చేయటంతో కాస్త విసుగనిపిస్తుంది. ఇప్పటికే హారర్‌ సినిమాలు చూసినవాళ్లకు ఈ కథ, కథనంలో ఎలాంటి కొత్త కోణం కనిపించదు.


బలాలు
 బ్రహ్మాజీ కామెడీ 
నిర్మాణ విలువలు
బలహీనతలు
ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ 
హారర్‌ అంశాలు లేకపోవడం
పతాక సన్నివేశాలు 


రివ్యూ: 2/5






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com