ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘ఖాకి’మూవీ రివ్యూ

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 17, 2017, 03:05 PM



చిత్రం : ‘ఖాకి’
నటీనటులు: కార్తి - రకుల్ ప్రీత్ - అభిమన్యు సింగ్ - బోస్ వెంకట్ తదితరులు
ఛాయాగ్రహణం: సత్యన్ సూర్యన్
సంగీతం: జిబ్రాన్ 
నిర్మాతలు: ఉమేష్ గుప్తా - సుభాష్ గుప్తా 
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: హెచ్.వినోద్  


తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న తమిళ కథానాయకుల్లో కార్తి ఒకడు. మధ్యలో ఇక్కడ అతడి మార్కెట్ కొంచెం దెబ్బ తిన్నప్పటికీ.. ఈ మధ్య అతను మళ్లీ పుంజుకుని తన ప్రతి సినిమానూ తెలుగులోకి తెస్తున్నాడు. కార్తి.. రకుల్ ప్రీత్ జంటగా నటించిన కొత్త సినిమా ‘ఖాకి’. హెచ్.వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.


కథ:  ధీరజ్ (కార్తి) నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. లంచాలు తీసుకోకుండా.. తన దగ్గరికి వచ్చే ప్రతి కేసును సులభంగా పరిష్కరిస్తూ మంచి పేరు సంపాదిస్తాడు. అతను బదిలీ మీద కొత్తగా వెళ్లిన స్టేషన్ పరిధిలో ఒక దోపిడీ కేసు కలకలం రేపుతుంది. ఒక దొంగల ముఠా వేర్వేరు చోట్ల ఒకే తరహాలో దోపిడీలు చేస్తున్నట్లు తెలుస్తుంది. పదేళ్లుగా పరిష్కారం లేకుండా సాగుతున్న ఈ కేసును ధీరజ్ సవాలుగా తీసుకుంటాడు. మరి ఆ కేసును ఛేదించే క్రమంలో ధీరజ్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.. చివరికి ఈ దోపిడీ ముఠాను అతను పట్టుకున్నాడా లేదా అన్నది మిగతా కథ.


కథనం - విశ్లేషణ: హీరో పోలీస్ అనగానే ఒక రకమైన కథలకు అలవాటు పడిపోయాం. హీరో చిన్న స్థాయి కానిస్టేబుల్ అయినా సరే.. అతడి విన్యాసాలకు హద్దు పద్దు ఉండదు. విలన్ ఎంతటి వాడైనా సరే.. హీరో తలుచుకుంటే అతడి సామ్రాజ్యాన్ని సునాయాసంగా కూల్చేస్తాడు. ఏం అనుకుంటే అది సాధించేస్తాడు. ఇలాంటి కథల మధ్య ‘ఖాకి’ చాలా భిన్నంగా అనిపిస్తుంది. ఇందులో హీరో డీఎస్పీ. ఐతే అతను ఓ కేసును ఛేదించడానికి ఉత్తరాదికి వెళ్తే అక్కడ ఒక ఊరిలో గ్రామస్థులందరూ అతడి టీం మీద దాడి చేయబోతారు. అతి కష్టం మీద వాళ్ల నుంచి తప్పించుకుని బతుకుజీవుడా అని బయటపడతాడు హీరో. ఇంకో చోట హీరో సరైన తిండి లేక ఇబ్బంది పడే తీరును చూపిస్తారు. దీన్ని బట్టే ‘ఖాకి’ సినిమా ఎలా సాగుతుందో అంచనా వేసుకోవచ్చు. ఐతే కథను వాస్తవికంగా చూపించే ప్రయత్నంలో దర్శకుడు వేగం గురించి.. నిడివి గురించి పెద్దగా పట్టించుకోలేదు. దీని వల్ల కొన్ని చోట్ల ‘ఖాకి’ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ఆ ఒక్క విషయంలో రాజీ పడగలిగితే.. రియలిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్లను ఇష్టపడేవారికి ‘ఖాకి’ కచ్చితంగా నచ్చుతుంది. 


చాలా ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఒక కేసును హీరో ఎలా ఛేదిస్తాడన్నది చాలా వాస్తవికంగా చూపించే సినిమా ఇది. కథలోకి ఆ కేసు రావడం ఆలస్యం.. మిగతా విషయాలన్నీ పక్కకు వెళ్లిపోతాయి. అప్పటిదాకా హీరోయిన్ పాత్ర ఉంటుంది. ఆమెతో హీరో రొమాన్స్ ఉంటుంది. పాటలు కూడా ఉంటాయి. కానీ ఒక్కసారి కథలోని అసలు పాయింట్ తెరమీదికి వచ్చాక దర్శకుడు ఇంకే విషయాలనూ పట్టించుకోలేదు. పూర్తిగా ఆ కేసు మీదే కథాకథనాల్ని నడిపించాడు. ఉత్తరాది రాష్ట్రాల్లో దోపిడీ దొంగల ముఠాల నేపథ్యం ఏంటి.. వాళ్లు దోచుకునే తీరు ఎలా ఉంటుంది.. వాళ్లు నెట్ వర్క్ ఎలా మెయింటైన్ చేస్తారు.. పోలీసులకు గ్యాంగులోని వాళ్లు చిక్కితే ఎంత మొండిగా వ్యవహరిస్తారు.. ఇలా ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా.. చాలా వాస్తవికంగా తెరమీద చూపించిన తీరు మెప్పిస్తుంది.


అసలు క్లూస్ ఏమీ లేని కేసును హీరో జీరో నుంచి మొదలుపెట్టి ఎలా ఛేదిస్తాడన్నది చాలా డీటైల్డ్ గా చూపించారు ఈ సినిమాలో. దాదాపు రెండు గంటల పాటు ఈ కేసు మీదే కథ నడుస్తుంది. ఉత్కంఠ రేపే కొన్ని సన్నివేశాలు.. కళ్లు చెదిరే యాక్షన్ ఘట్టాల్ని మినహాయించి చూస్తే నిజానికి ‘ఖాకి’ ఒక డాక్యుమెంటరీ తరహాలో అనిపిస్తుంది. ఐతే హీరో పరిశోధన క్రమం ఆసక్తి రేకెత్తించేలా ఉండేలా దర్శకుడు స్క్రీన్ ప్లే బాగా తీర్చిదిద్దుకున్నాడు. ఆరంభంలో హీరో పాత్ర పరిచయం.. రొమాంటిక్ ట్రాక్ కొంచెం నెమ్మదిగా సాగినప్పటికీ.. హీరో ముందుకు దోపిడీ కేసు వచ్చినప్పటి నుంచి కథనం వేగం పుంజుకుంటుంది. ఇంటర్వెల్ ముందు దోపిడీ దొంగల భీభత్సాన్ని చూపిస్తూ.. హీరో వాళ్లను రీచ్ అయ్యే ప్రయత్నం చేసే సన్నివేశాలు ఉత్కంఠ రేకెత్తిస్తాయి.


 


ద్వితీయార్ధంలోనూ ఇలా హైలైట్ అయ్యే కొన్ని సీన్స్ ఉన్నాయి. హీరో తన టీంతో కలిసి దొంగల ముఠాలో ఒకడిని పట్టుకోవడానికి అతడి ఊరు వెళ్తే గ్రామమంతా ఏకమై హీరో బృందాన్ని తరిమికొడుతుంది. ఈ ఎపిసోడ్ చాలా బాగా తీశారు. తర్వాత ఆ దొంగను హీరో వెంటాడి పట్టుకునే ఎపిసోడ్ కూడా అలరిస్తుంది. ఇక్కడ వచ్చే యాక్షన్ సీన్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఐతే ఒక దశ దాటాక హీరో పరిశోధన మరీ నెమ్మదించిపోయి.. కథ ముందుకు కదలక ప్రేక్షకుడు అసహనానికి గురయ్యే పరిస్థితి వస్తుంది. దాదాపు రెండు ముప్పావు గంటల నిడివి ఉండటం ఈ చిత్రానికి మైనస్సే. 


ద్వితీయార్ధంలో మలుపులంటూ ఏమీ లేకపోవడం.. హీరో దొంగల ముఠా నాయకుడిని పట్టుకోవడం తప్ప వేరే పాయింట్ అంటూ ఏమీ లేకపోవడం కూడా ఆసక్తిని తగ్గించేస్తుంది. ఐతే పతాక సన్నివేశాన్ని మాత్రం ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దారు. సినిమాను రియలిస్టిగ్గా నడిపించడం కొత్తగా అనిపించినప్పటికీ.. వేగం గురించి కూడా పట్టించుకోవాల్సింది. ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ ఉత్కంఠ రేకెత్తిస్తుంది కానీ.. కథలో ఏ ఉత్కంఠా లేదు. ఓవరాల్ గా ‘ఖాకి’ ఆసక్తి రేకెత్తించే థ్రిల్లరే. కానీ అక్కడక్కడా కొంచెం సహనాన్ని కూడా పరీక్షిస్తుంది.


 


నటీనటులు :  కార్తి నటన ‘ఖాకి’ సినిమాకు అతి పెద్ద ఆకర్షణ. నిజమైన పోలీసుని చూస్తున్నట్లు అనిపించేలా తన పాత్రను రక్తి కట్టించాడు కార్తి. అతడి లుక్.. యాక్టింగ్ అన్నీ కూడా పర్ఫెక్టుగా కుదిరాయి. యాక్షన్ సన్నివేశాల్లో కార్తి పడ్డ కష్టం కనిపిస్తుంది. కార్తి తెలుగు డబ్బింగ్ మీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టాల్సింది. రకుల్ ప్రీత్ పాత్ర మామూలుగానే అనిపిస్తుంది. ఆమె కొన్ని సన్నివేశాల్లో మెరిసి మాయమవుతుంది. ప్రథమార్ధంలో ఓ అరగంట కనిపించే రకుల్.. ఆ తర్వాత తెరమీదే ఉండదు. దర్శకుడు ద్వితీయార్ధంలో ఆమెను పూర్తిగా పక్కన పెట్టేశాడు. విలన్ పాత్రలో అభిమన్యు సింగ్ అదరగొట్టాడు. దోపిడీ దొంగల ముఠా నాయకుడంటే ఇలాగే ఉంటాడేమో అనిపించేలా సాగుతుంది అతడి నటన. అభిమన్యు లుక్ విషయంలో చాలా శ్రద్ధ పెట్టారు. పళ్లు.. హెయిర్ స్టైల్.. డ్రెస్సింగ్ అన్నీ కూడా సహజంగా ఉండేలా చూసుకున్నారు. బోస్ వెంకట్ కూడా బాగానే చేశాడు. దొంగల ముఠాలో కనిపించే నటీనటులందరూ కూడా సహజంగా అనిపిస్తారు.


సాంకేతికవర్గం:  జిబ్రాన్ సంగీతం పర్వాలేదు. పాటలు పెద్దగా రిజిస్టర్ కావు. నేపథ్య సంగీతం మాత్రం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. యాక్షన్ సన్నివేశాల్ని బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేట్ చేస్తుంది. సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం సినిమాకు పెద్ద ప్లస్. నార్త్ ఇండియాలో నడిచే సన్నివేశాల్ని చాలా బాగా చిత్రీకరించాడు. అక్కడి పల్లెల్లో నేటివిటీని బాగా చూపించాడు. సినిమాకు ఎంతో కీలకమైన యాక్షన్ ఘట్టాల్ని చిత్రీకరించిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. ఆర్ట్ వర్క్ కూడా బాగుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. ఇక దర్శకుడు వినోద్ తన తొలి సినిమా ‘శతురంగ వేట్టై’లో మాదిరి వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ కథను అల్లుకున్నాడు. కథ విషయంలో అతను ఎంతో పరిశోధించిన విషయం తెరమీద కనిపిస్తుంది. రచయితగా.. దర్శకుడిగా అతడి పనితనం చాలాచోట్ల కనిపిస్తుంది. ఐతే కథను చెప్పడానికి అతను చాలా సమయం తీసుకున్నాడు. ద్వితీయార్ధాన్ని వేగంగా నడిపించి ఉంటే ‘ఖాకి’ మరింత మెప్పించేదే.


రివ్యూ  : 3/5






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com