ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘జైసింహా’లో నయనతార లుక్‌ చూశారా

cinema |  Suryaa Desk  | Published : Sat, Nov 18, 2017, 03:29 PM



దక్షిణ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా రాణిస్తున్న ముద్దుగుమ్మ నయనతార. ఆమెకు అభిమానుల్లో ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. అందుకే ఆమెను ‘లేడీ సూపర్‌స్టార్‌’ అని పిలుస్తుంటారు. కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రం అంటే దర్శక, నిర్మాతలకు ముందుగా ఆమె పేరు గుర్తొస్తుందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇటీవల విడుదలైన ‘అరాం’ చిత్రం నయనతార సినీ కెరీర్‌లో మరో మైలురాయిలా నిలిచింది. ఈ చిత్రాన్ని చూసిన రజనీకాంత్‌ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఆమె ‘జైసింహా’, ‘వెలైక్కరన్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు.


శనివారం నయనతార పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ట్విటర్‌లో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం ‘హ్యాపీ బర్త్‌డే లేడీ సూపర్‌స్టార్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉంది. కాగా నయనతారకు శుభాకాంక్షలు చెబుతూ ‘జైసింహా’లో నయనతార ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె చాలా అందంగా కనిపించారు. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నయనతారతోపాటు హరిప్రియ, నటాషా దోషి కథానాయిక పాత్రలు పోషిస్తున్నారు. సీకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి. కల్యాణ్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల ఇందులో బాలకృష్ణ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com