దర్శకుడు శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వస్తున్న ‘ఇండియన్ 2’ చిత్రం కొంతమేర షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకుని తాజా షెడ్యూల్ కోసం ‘ఇండియన్ 2’ టీమ్ రాజమండ్రిలో సందడి చేస్తోంది. జైలు నేపథ్యంలో తెరకెక్కే సన్నివేశాల చిత్రీకరణ రాజమండ్రిలో జరుగుతోంది. అందుకోసం రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికైంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో షూటింగ్ స్పాట్ నుండి విడుదలైన కొన్ని ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోల్లో విశ్వనటుడు కమల్‌హాసన్ క్లీన్‌షేవ్‌తో కనిపిస్తున్నారు. చుట్టూ పోలీసులు, సిబ్బంది, జనాలతో కోలాహలంగా కనిపిస్తోంది. మొత్తానికి ఈ అప్డేట్తో ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్ ఆగిపోలేదని తెలిసిపోయింది. ఇక 1996లో సంచలన విజయం అందుకున్న ‘ఇండియన్’ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న సినిమా ఇది. దాదాపు 23 ఏళ్ల గ్యాప్ తర్వాత కమల్‌హాసన్ ఈ సీక్వెల్లో నటిస్తున్నారు. స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండగా రకుల్‌ప్రీత్ సింగ్ మరో హీరోయిన్గా నటిస్తోంది. హీరో సిద్ధార్థ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది.