పవన్ కల్యాణ్‌‌ డేట్స్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న ప్రముఖ నిర్మాత...!

  Written by : Suryaa Desk Updated: Tue, Oct 22, 2019, 01:22 PM

గత కొన్ని రోజులుగా జనసేన అధినేత, ప్రముఖ టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ మరోసారి సినిమాల్లో నటిస్తారన్న వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. దీంతో పవన్ కల్యాణ్ మరోసారి వెండితెరపై కనిపిస్తాడని ఆయన అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ విషయం కాస్త పక్కన పెడితే... పవన్ మరోసారి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారన్న వార్తలతో ప్రముఖ ప్రొడ్యూసర్ ఆయన డేట్స్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కొన్నిరోజులు సమయం ఇస్తే చాలు.. పవన్‌తో సినిమా తీస్తానని ఎదురుచూస్తున్నారు. ఆయన ఎవరో కాదు.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు. పవన్ తనకు కేవలం 25 రోజులు టైం ఇస్తే చాలంటున్నారు. ఆయనతో కలిసి ఓ సినిమా తీస్తానని చెబుతున్నారు. బాలీవుడ్‌లో హిట్ టాక్ తెచ్చుకున్న పింక్ సినిమాను... దిల్ రాజు తెలుగులో రిమేక్ చేయాలనుకుంటున్నారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్, తాప్సీ ప్రధాన పాత్రలను పోషించిన ఈ సినిమా, కథాకథనాలపరంగా ప్రశంసలు అందుకుంది. ఇటీవల అజిత్ - శ్రద్ధా శ్రీనాథ్‌తో కలిసి తమిళంలో కూడా రీమేక్ చేశారు. అక్కడ కూడా 'పింక్' ఘన విజయాన్ని సాధించింది. దీంతో ఈ సినిమా తెలుగు హక్కులను దక్కించుకున్నారు దిల్ రాజు. అయితే పవన్ కల్యాణ్‌తో కలిసి పింక్ రీమేక్ చేయాలనుకుంటున్నారు. 'కేవలం 25 రోజులు .. అదీ ఎప్పుడు వీలైతే అప్పుడు కేటాయిస్తే చాలు' అని పవన్ కి త్రివిక్రమ్ ద్వారా దిల్ రాజు మెసేజ్ కూడా పంపినట్టుగా సమాచారం. మరి చాలా తక్కువ రోజులే సమయమే కాబట్టి పవన్ ఈ పింక్ ప్రాజెక్టు‌కు గ్నీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అన్నది ఇంకా తేలాల్సి ఉంది.
Recent Post