తగ్గేది లేదంటున్న మహేష్ బాబు...

  Written by : Suryaa Desk Updated: Sun, Nov 17, 2019, 04:18 PM

2020 సంక్రాంతి సీజన్‌లో బిగ్‌ ఫైట్‌ తప్పేలా లేదు. మహేష్ బాబు, అల్లు అర్జున్‌లు ఒకే డేట్‌ విషయంలో పట్టు పట్టడంతో సంక్రాంతి వార్‌ రసవత్తరంగా మారింది. 2020 సంక్రాంతి సీజన్‌ టాలీవుడ్‌లో రసవత్తరంగా మారనుంది. ఇద్దరు టాప్‌ స్టార్లు ఒకసారి బరిలో దిగుతుండటంతో అభిమానులు ఈ బిగ్‌ఫైట్‌ను ఆసక్తిగా గమనిస్తున్నారు. సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో సినిమాలో జనవరి 12న ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇప్పటికే ఈ మేరకు రెండు సినిమాలు యూనిట్‌లు అధికారిక ప్రకటన ఇచ్చేశాయి. అయితే కొద్ది రోజులు రెండు చిత్రాల నిర్మాతలు రిలీజ్‌ విషయంలో చర్చలు జరుపుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఒకే రోజు బరిలో దిగితే థియేటర్ల సమస్య తలెత్తటంతో పాటు ఓపెనింగ్స్‌ మీద కూడా ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. అందుకే రిలీజ్‌ డేట్స్‌ అడ్జస్ట్ చేసుకునేందుకు ప్రయత్నాలు జరిగాయి. అయితే తాజా సమాచారం ప్రకారం రిలీజ్‌ డేట్‌ విషయంలో మహేష్‌ బాబు వెనక్కి తగ్గేది లేదంటున్నాడట. సంక్రాంతి సీజన్‌లో ముందుగా వచ్చిన సినిమా ఫెయిల్ అవుతుందన్న సెంటిమెంట్‌ ఉంది. అందుకే ముందుగా బరిలో దిగేందుకు ఇద్దరు హీరోలు వెనకడుగు వేస్తున్నారు. ఇన్నాళ్లు మహేష్ జనవరి 11న, బన్నీ జనవరి 12న బరిలో దిగే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది. అయితే మహేష్ అందుకు ససేమిరా అంటున్నాడట. దీంతో సంక్రాంతి ఫైట్‌పై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఇద్దరు హీరోలు ఒకే రోజు బరిలో దిగుతారా లేక ఎవరైనా వెనక్కి తగ్గుతారా అని అభిమానులతో పాటు సినీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు తమిళ డబ్బింగ్ సినిమా దర్బార్‌, కళ్యాణ్ రామ్‌ హీరోగా తెరకెక్కుతున్న ఎంత మంచి వాడవురా సినిమాలు కూడా సంక్రాంతి సీజన్‌లోనే రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. మహేష్‌ బాబు, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాకు అనిల్‌ రావిపూడి దర్శకుడు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో సీనియర్‌ నటి విజయశాంతి లాంగ్ గ్యాప్‌ తరువాత సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీ ఇస్తున్నారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో సినిమాలో అల్లు అర్జున్‌, పూజా హెగ్డేలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్‌ నటి టబుతో పాటు హీరో సుశాంత్‌, నివేదా పేతురాజ్‌, నవదీప్‌, మలయాళ నటుడు జయరామ్‌, రాహుల్ రామకృష్ణలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Recent Post