డిసెంబర్ 6న `భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు`

  Written by : Suryaa Desk Updated: Sun, Nov 17, 2019, 07:07 PM

కమెడియన్ కం హీరో శ్రీనివాస రెడ్డి ఏ ప్రయత్నం చేసినా కొత్తగానే ఉంటుంది. ఆయనలోని క్రియేటర్ కం డైరెక్టర్ కి ఇప్పటికే గుర్తింపు దక్కింది. మునుముందు నిర్మాతగానూ తనదైన మార్క్ వేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ క్రమంలోనే ఆకృతి - ఆశృతి సమర్పణలో.. ఏ ఫ్లైయింగ్ కలర్స్ ఎంటర్ టైన్ మెంట్ ప్రొడక్షన్ బ్యానర్ పై స్వీయ నిర్మాణదర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా `భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు`  `మంచి రసగుల్లా లాంటి సినిమా` అనేది ట్యాగ్ లైన్. శ్రీనివాసరెడ్డితో పాటు సత్య.. షకలక శంకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ తేదీని ప్రకటించారు. డిసెంబర్ 6న మీ ముందుకు వస్తున్నాం! అంటూ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు. నోట్లు గాల్లో లేస్తున్నాయా?  లేక గాల్లో విసిరేస్తున్నారా?  అసలేమిటీ దుమారం? అన్నట్టే ఉందా పోస్టర్. ఈ చిత్రంలో శ్రీనివాస రెడ్డి పాత్రతో పాటుగా కమెడియన్ సత్యా.. షకలక శంకర్ పాత్రలకు అంతే ప్రాధాన్యత ఉందని అర్థమవుతోంది. కథను డైవర్ట్ చేసే కామెడీ కాకుండా కథతో పాటు సాగే కామెడీ హైలైట్ గా తీర్చిదిద్దారట. ఇక ఇందులో శ్రీనివాసరెడ్డితో పాటుగా సత్య-శంకర్ కాంబో సీన్లు హిలేరియస్ కామెడీని పండించనున్నాయట. ట్రైలర్ త్వరలో రిలీజ్ కానుంది. యాక్షన్.. సెంటింమెంట్ లేకుండా కేవలం కామెడీ ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు  `జయమ్ము నిశ్చయమ్మురా` రైటర్ పరమ్ సూర్యాన్షు కథ-కథనం-డైలాగ్స్ అందించారు. సాకేత్ కోమండూరి సంగీతం అందిస్తున్నారు. భరణి కె ధరన్ వంటి ప్రతిభావంతుడు ఛాయాగ్రాహకుడిగా పని చేస్తున్నారు. మరో కమెడియన్ చిత్రం శ్రీను లైన్ ప్రొడ్యూసర్ గా పని చేయడం ఆసక్తికరం. జంధ్యాల- ఈవీవీ సత్యనారాయణ లేని లోటు.. రేలంగి నరసింహారావు వంటి దర్శకులు సినిమాలు చేయని లోటును తీర్చడం ఎవరి వల్లా కాదు. కనీసం శ్రీనివాస రెడ్డి & కమెడియన్స్ బృందం ఈ తరహా ప్రయత్నం చేస్తుండడం కొంతవరకూ ఆ లోటును తీరుస్తుందేమో చూడాలి.
Recent Post