ఆ మూగ జీవాల కోసం రష్మీ గౌతమ్!

  Written by : Suryaa Desk Updated: Sun, Dec 15, 2019, 02:05 PM

ఎనర్జిటిక్‌గా యాంకరింగ్ చేసే రష్మీ గౌతమ్... తెరవెనక మాత్రం ఎంతో సెన్సిటివ్. ముఖ్యంగా మూగ జీవాలకు ఏదైనా జరిగితే ఆమె అస్సలు తట్టుకోలేదు. ఇది వరకు ఎన్నో సందర్భాల్లో మూగ జీవాల్ని కాపాడి... వాటి కోసం హృదయాన్ని కదిలించే మెసేజ్‌లు పోస్ట్ చేసిన రష్మీ... తాజాగా మరోసారి ఆవేదన కలిగించే పోస్ట్ ఒకటి పెట్టింది. అదేంటంటే... మన దేశంలో వేటగాళ్లు ఏటా దాదాపు లక్ష ముంగీసల్ని చంపేస్తున్నారు. వాటి జుట్టుతో పెయింట్ బ్రష్‌లను తయారుచేస్తున్నారు. సింథటిక్ పెయింట్ బ్రష్‌ల కంటే అవే రేటెక్కువ. గత మూడేళ్లలో 1,96,297 బ్రష్‌ల నుంచీ 280 కేజీల ముంగీసల జుట్టును పోలీసులు రికవరీ చేశారు. దీన్ని బట్టీ... మన దేశంలో వన్యప్రాణుల రక్షణకు ఏమాత్రం జాగ్రత్తలు తీసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చని రష్మీ పోస్ట్ చేసింది. పెయింటింగ్ బ్రష్‌లతో పిల్లలు ఆనందంగా వేసుకునే బొమ్మలు వేసుకుంటారు. అలాంటి బ్రష్‌ల వెనక ఇంతటి విషాదం ఉండటం బాధాకరమే. దీనిపై ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళలో ఇటీవల ఆకస్మిక దాడులు చేశారు. 200 మంది పోలీసులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. పెయింటింగ్ బ్రష్‌లు తయారుచేసే ఫ్యాక్టరీల్లో తనిఖీలు చేశారు. 26వేల బ్రష్‌ల నుంచీ 100 కేజీల ముంగీస జుట్టును సీజ్ చేశారు. ఇందుకు సంబందించి 26 మందిని అరెస్టు చేశారు.
Recent Post