2020లో మహేష్ , బన్నీలు శుభారంభం

  Written by : Suryaa Desk Updated: Sun, Jan 19, 2020, 08:08 PM

ప్రతి సంవత్సరం మొదటి నెల జనవరిలో రెండు పెద్ద సినిమాలు విడుదలకావడం ఆనవాయితీ. ఆ రెండు సినిమాలు గనుక భారీ విజయాల్ని సాధిస్తే ఇక ఆ యేడాది మొత్తం సినీ పరిశ్రమకు బాగా కలిసొస్తుందని అందరూ భావిస్తుంటారు. ఈ సంక్రాంతికి  జనవరి 11 న సరిలేరు నీకెవ్వరూ విడుదల కాగా..జనవరి 12 న అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురం లో విడుదల అయ్యింది. ఇక దేశ వ్యాప్తం గా కూడా ఈ రెండు చిత్రాలు తమ సత్తా చాటుతూ వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ 2020 ఆరంభ భాద్యతల్ని మహేష్ బాబు, అల్లు అర్జున్ తీసుకున్నారు. వీరు నటించిన ‘అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు నువ్వా నేనా అన్నట్టు తీవ్రమైన పోటీ నడుమ విడుదలయ్యాయి. ఒకేసారి వస్తున్న రెండు సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారా, అసలు అంత భారీ ట్రేడ్ జరిగే వీలుందా అనే అనుమానం కలిగింది విశ్లేషకుల్లో. కానీ ఆ అనుమానాల్ని పక్కకు తోస్తూ రెండు సినిమాలు విజయాన్ని అందుకున్నాయి. ప్రేక్షకులు కాసుల వర్షం కురిపించారు. విడుదలైన వారం రోజులకే రెండు సినిమాలు కలిపి ఏపీ, తెలంగాణల్లో సుమారు రూ.180 కోట్ల వరకు షేర్ కొల్లగొట్టాయి. ఈ స్థాయి బిజినెస్ 2020లో పరిశ్రమకు శుభారంభం.
Recent Post