ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలకృష్ణ ' జైసింహా' సినిమా రివ్యూ

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 12, 2018, 12:43 PM



అత్యంత వేగంగా సినిమాలను చేసే అగ్ర కథానాయకుల్లో బాలకృష్ణ ముందుంటారు. అంతేకాదు, యువ కథానాయకులకు పోటీగా డ్యాన్సులు, ఫైట్‌లు చేస్తుంటారు. ‘మానసికంగా నేనెప్పటికీ కుర్రాణ్నే. మనం ఏది చేసినా అభిమానులను అలరించేందుకే’ అంటూ నవ్వుతూ అనేస్తారు. ఇక సంక్రాంతి అంటే బాలకృష్ణ.. బాలకృష్ణ అంటే సంక్రాంతి.. పెద్ద పండగకు విడుదలైన బాలయ్య ప్రతీ చిత్రమూ బాక్సాఫీస్‌ వద్ద ఆకట్టుకున్నదే. తాజాగా కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘జైసింహా’. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? కె.ఎస్‌.రవికుమార్‌-బాలయ్యల సరికొత్త కాంబినేషన్‌ ఆకట్టుకుందా? సంక్రాంతి సీజన్‌లో బాలకృష్ణ మరోసారి మేజిక్‌ చేశారా?


కథేంటంటే: నరసింహ(బాలకృష్ణ) గౌరి(నయనతార)కి తెలియకుండా ఆమె కొడుకుని తీసుకుని విశాఖపట్నం నుంచి కుంభకోణం చేరుకుంటాడు. అక్కడి ఆలయ ధర్మకర్త(మురళీమోహన్‌) ఇంట్లో డ్రైవర్‌గా పనిలో చేరతాడు. అయితే ఆ సమయంలో ఆలయ ధర్మకర్త కుమార్తె ధాన్య(నటాషా దోషి) యాక్సిడెంట్‌ చేయడంతో ఆ నేరాన్ని తనపై వేసుకుంటాడు. దీంతో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. శత్రువుల దాడి కూడా ఎక్కువవుతుంది. మరోవైపు అక్కడి ఏసీపీని ఎదిరించడంతో అతనికి కూడా శత్రువుగా మారతాడు. దీంతో ఆ చిన్నారిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాలను బయలుదేరతాడు. ఇదే సమయంలో గౌరి తన కొడుకుని వెతుక్కుంటూ కుంభకోణం వస్తుంది. అప్పుడు నరసింహకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.. నరసింహకు గౌరికీ, సంబంధం ఏంటి? నరసింహ కుంభకోణం ఎందుకు రావాల్సి వచ్చింది?


ఎలా ఉందంటే: ఇది బాలకృష్ణ నటించిన మరో మాస్‌, కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. సాధారణంగా బాలకృష్ణ సినిమా హెవీ యాక్షన్‌ డోస్‌తో ప్రారంభం అవుతుంది. ఒక పాటతోనో.. ఫైట్‌తోనే ఆయన పరిచయ సన్నివేశం ఉంటుంది. అయితే ఇందులో మాత్రం కాస్త భిన్నంగా సాగింది. ఓ చంటి బాబుతో కథానాయకుడిని పరిచయం చేశారు. దీంతో సినిమా ఎలా సాగుతుందో ప్రేక్షకుడు ఓ అంచనాకి వచ్చేస్తాడు. అయితే దర్శకుడు తెలివిగా బాలయ్య అభిమానులకు ఏం కావాలో అవి ఇస్తూ, అక్కడక్కడా సెంటిమెంట్‌ను జొప్పిస్తూ, మధ్యలో కథ చెబుతూ నడిపించాడు. తొలి అర్ధభాగం కుంభకోణం నేపథ్యంలో సాగుతుంది. అభిమానులను ఆకట్టుకునేలా ఆయా సన్నివేశాలను తీర్చిదిద్దారు. పురోహితుల గొప్పతనం గురించి చెప్పే సన్నివేశంలో బాలకృష్ణ మార్కు డైలాగ్‌లు నటన, ఆకట్టుకుంటాయి. డైలాగ్‌లు పలకడంలో బాలకృష్ణకు ఉన్న ప్రత్యేకత ఏంటో ఈ సన్నివేశం మరోసారి నిరూపిస్తుంది. విశ్రాంతికి ముందు వచ్చే యాక్షన్‌ సన్నివేశాలను మాస్‌కు నచ్చేలా రామ్‌లక్ష్మణ్‌ తెరకెక్కించారు. అయితే బ్రహ్మానందం ఎపిసోడ్‌లు కాస్త సుదీర్ఘంగా సాగినట్లు అనిపిస్తాయి. నయనతార ఎంట్రీతో కథ మరో మలుపు తిరుగుతుంది.


ద్వితీయార్ధం ఫ్లాష్‌బ్యాక్‌పైనే ఆధారపడ్డాడు దర్శకుడు. నయనతారతో బాలకృష్ణ ప్రేమ సన్నివేశాలు, ప్రకాష్‌రాజ్‌తో సెంటిమెంట్‌ సన్నివేశాలు బాగున్నాయి. అయితే ఆయా సన్నివేశాలకు ఇంకాస్త కత్తెర వేస్తే బాగుండేది. పతాక సన్నివేశాలను విభిన్నంగా తీర్చిదిద్దారు. సెంటిమెంట్‌ను పండించటంలో దర్శకుడు సఫలమయ్యాడు. బాలకృష్ణ ఒక స్వచ్ఛమైన ప్రేమికుడిగా చూపించడంలో విజయవంతమయ్యాడు. అలా ఇది బాలకృష్ణకు ఒక కొత్తరకం సినిమా అనే చెప్పాలి. ఒక ప్రేమికుడి త్యాగంగా ‘జైసింహా’ను అభివర్ణించవచ్చు. వినోదం విషయంలో మరిన్ని కసరత్తులు తీసుకుని ఉంటే బాగుండేది.


ఎవరెలా చేశారంటే: బాలకృష్ణ పాత్ర రెండు కోణాల్లో ఉంటుంది. ‘నరసింహనాయుడు’, ‘సమర సింహారెడ్డి’ చిత్రాల్లో కథానాయకుడి పాత్ర శాంతంగా ఉంటుంది. ద్వితీయార్ధంలో విశ్వరూపం చూపిస్తాడు. అదే ఫార్ములాను దర్శకుడు అనుసరించాడు. ఆ రెండు కోణాల్లో బాలకృష్ణ నటన ఆకట్టుకుంటుంది. ‘అమ్మకుట్టి’ పాటలో బాలయ్య స్టెప్పులు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఫ్యాన్స్‌ను అలరించడానికి తనవంతు కృషి చేశారు బాలకృష్ణ. కథానాయికలు ముగ్గురు ఉన్నా, ప్రాధాన్యం అంతా నయనతారదే.


ఎప్పటిలాగే పద్ధతిగా కనిపించింది. నటాషా దోషి గ్లామర్‌ ఒలికిస్తే.. హరిప్రియ మంగ పాత్రలో కాస్త అల్లరి చేసింది. చాలా రోజుల తర్వాత బ్రహ్మానందానికి పూర్తి నిడివి ఉన్న పాత్ర దక్కింది. అయితే దర్శకుడు ఆయన నుంచి సరైన వినోదాన్ని రాబట్టలేకపోయారు. విలన్‌ గ్యాంగ్‌ కాస్త పెద్దదిగా ఉంది. వాళ్లు తమ పాత్రలను సమర్థంగా పోషించారు. చిరంతన్‌ భట్‌ పాటల్లో ‘అమ్మకుట్టి’ మాస్‌ను అలరిస్తుంది. మిగిలినవి మెలోడీ ప్రధానంగా సాగుతాయి. నేపథ్య సంగీతంపై మరింత దృష్టి పెడితే బాగుండేది. దర్శకుడు పాత కథనే మళ్లీ ఎంచుకున్నాడు. చిన్న బాబు పాత్ర లేకపోతే సినిమా రొటీన్‌గా ఉండేది. రత్నం డైలాగ్‌లు అలరిస్తాయి. బాలకృష్ణ మాడ్యులేషన్‌కు తగ్గటుగా డైలాగ్‌లు రాశారు. సినిమాటోగ్రఫీ బాగుంది. దుబాయ్‌ సన్నివేశాలను అందంగా చూపించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.


బలాలు 
బాలకృష్ణ
నయనతార
సెంటిమెంట్‌ సన్నివేశాలు
యాక్షన్‌ ఎపిసోడ్‌లు


బలహీనతలు
వినోదం పాళ్లు తగ్గడం
సెంటిమెంట్‌ కాస్త పెరగడం 


రివ్యూ  : 3/5


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com