రిపబ్లిక్ డేకి ‘ఆచారి అమెరికా యాత్ర’

  Written by : Suryaa Desk Updated: Fri, Jan 19, 2018, 02:08 PM
 

మంచు విష్ణు హీరోగా, కామెడీ కింగ్ బ్రహ్మానందం మరో ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’. జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. పద్మజ పిక్చర్స్ బ్యానర్‌పై కీర్తి చౌదరి, కిట్టు ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను శనివారం (జనవరి 20న) హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు.


ఇదిలా ఉంటే, కామెడీ ప్రధానంగా సాగే టీజర్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంటోంది. బ్రహ్మానందం, విష్ణు కాంబినేషన్ కామెడీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది. ఎస్.ఎస్. తమన్ స్వరపరిచిన ‘స్వామి రా రా’ అనే బీట్‌తో వచ్చిన పాట ప్రేక్షకులతో స్టెప్పులేయించెలా ఉంది. అలాగే సంక్రాంతి రోజున విష్ణు విడుదల చేసిన మరో పాట ‘చెలియా’ సంగీత ప్రియులను అలరిస్తోంది. అచ్చు రాజమణి సంగీతం సమకూర్చిన ఈ రొమాంటిక్ మెలోడీ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించిన లిరిక్స్ మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. ఈ పాటల ప్రోమోలకు వస్తోన్న మంచి స్పందనతో మొత్తం ఆడియోను త్వరలో విడుదలచేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.


కాగా, జి.నాగేశ్వర్ రెడ్డి - విష్ణుల కలయికలో ‘దేనికైనా రెడీ’, ‘ఈడో రకం ఆడో రకం’ సినిమాలు గతంలో వచ్చాయి. ఈ రెండు సినిమాలు కడుపుబ్బా నవ్వించాయి. ఇప్పుడు ‘ఆచారి అమెరికా యాత్ర’ కూడా అదే తరహా వినోదాన్ని అందించనుందని చిత్ర యూనిట్ తెలిపింది. విష్ణు సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది.
Recent Post