రంగస్థలం’ లాంటి సినిమా తర్వాత రెండేళ్లుగా సుకుమార్ మరో సినిమా చేయలేదు. మధ్యలో మహేష్ బాబు సినిమా అనుకున్నా కూడా వర్కవుట్ కాలేదు. దాంతో అల్లు అర్జున్తో సినిమా చేస్తున్నాడు. దీనికి పుష్ప అనే టైటిల్ కూడా పెట్టాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ చిత్రంలో ఓ ఐటెమ్ సాంగు చేయడానికి అందాల భామ పాయల్ రాజ్ పుత్ ను ఎంపిక చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై పాయల్ రాజ్ పుత్ స్పందించింది. ఇలాంటి పుకార్లు ఎలా పుడతాయో అర్థం కావడంలేదని వాపోయింది. 'పుష్ప' చిత్రంలో తాను ఎలాంటి పాటలో నటించడంలేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో తననెవరూ సంప్రదించలేదని వెల్లడించింది. 'పుష్ప' చిత్రంతో పాటు 'ఇండియన్-2' చిత్రంలో మీరు ఐటెమ్ సాంగులు చేస్తున్నారట కదా అంటూ గత కొన్నిరోజులుగా తనకు ఎన్ని సందేశాలు వచ్చాయో దేవుడికే తెలుసని పేర్కొంది. ఇవన్నీ రూమర్లేనని, ప్రస్తుతం తాను ఏ సినిమా చిత్రీకరణలో పాల్గొనడంలేదని పాయల్ స్పష్టం చేసింది.