ఫస్ట్‌లుక్ టాక్: భోజ్‌పురి "బాహుబలి"

  Written by : Suryaa Desk Updated: Tue, Feb 13, 2018, 03:27 PM
 

ఒక భాషలో ఒక సినిమా హిట్టయితే దానిని వేరే భాషకి చెందిన హీరోలు రీమేక్ చేయడం.. ఏనాటి నుంచో వస్తోంది.. సోషల్ మీడియా పుణ్యమా అని అది ఈ మధ్యకాలంలో మరింత ఎక్కువైంది. అలాంటిది బాహుబలిని వదిలిపెడతారా..? ఒక ప్రాంతీయ భాష చిత్రం బాలీవుడ్‌కే కష్టతరమైన రూ.1000 కోట్ల వసూళ్ల టార్గెట్‌ను అందుకుని సంచలనం కలిగించింది. ఈ రికార్డును కొట్టడానికి బాలీవుడ్ చైనా సాయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. అమీర్ ఖాన్ నటించిన దంగల్ చైనాలో రిలీజై రూ. 2 వేల కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక పోతే ఎస్ఎస్.రాజమౌళీ సృజనాత్మకతకు.. నటీనటుల కష్టానికి నిదర్శనం బాహుబలి.


చాలామంది ఈ కళాఖండాన్ని రీమేక్ చేయాలని భావించినప్పటికీ.. న్యాయం చేయగలమా లేదా అనే క్లారిటీ లేక ఆ ఆలోచన నుంచి విరమించుకున్నారు. అయితే భోజ్‌పురి చిత్ర పరిశ్రమ మాత్రం ధైర్యం చేసింది. అదే "వీర్ యోధ మహాబలి".. దీనిలో భోజ్‌పురి స్టార్ హీరో దినేశ్ లాల్ యాదవ్ కథానాయకుడిగా.. ఆమ్రపాలి దుబే కథానాయకగా నటిస్తున్నారు. దీనిని ఎలా టేకప్ చేస్తున్నారా అని ఎదురుచూస్తోన్న యావత్ భారతీయ చిత్ర పరిశ్రమకు మహాశివరాత్రి కానుకగా.. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ ప్రజంట్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. గుర్రంపై కత్తిపట్టి యుద్దానికి సిద్దపడిన దినేశ్ లుక్ ఆకట్టుకుంటోంది. భోజ్‌పురితో పాటు హిందీ, తెలుగు, తమిళ్, బెంగాళీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇక్భాల్ బక్ష్ దర్శకత్వం వహిస్తుండగా.. ఎం. రమేశ్ వ్యాస్ నిర్మిస్తున్నారు.
Recent Post