ఇప్పటివరకు ఇంకా ఎవ్వర్నీ ప్రేమించలేదు : ప్రియా ప్రకాశ్‌

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 02:58 PM
 

ఒక్క చూపుతో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకుంది మలయాళీ భామ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. ‘ఒరు అదర్‌ లవ్‌’లోని ‘మణిక్య మలరయ’ అనే పాటలో ఆమె పలికించిన హావభావాలు సంచలనం సృష్టించాయి. ఈ సందర్భంగా తొలిసారి తన వీడియోకు వస్తున్న స్పందనలపై ప్రియ ఓ ఆంగ్ల మీడియా ద్వారా స్పందించారు.


‘చాలా సంతోషంగా ఉంది. నా జీవితమే మారిపోయింది. అభిమానుల నుంచి వస్తున్న ఇంతటి ఆదరణను ఎలా తట్టుకోవాలో అర్థంకావడంలేదు. నా ఆనందాన్ని వివరించడానికి మాటలు చాలవు. ఇంతటి పాపులారిటీ వస్తుందని కలలో కూడా ఊహించలేదు. చెప్పాలంటే ఈ సినిమాలో నా కనుబొమలతోనే హావభావాలు పలికించాలని దర్శకుడు చెప్పారు. ఉత్తర కేరళలో ప్రసిద్ధి చెందిన ‘మప్పిళ’ పాటను ‘మణిక్య మలరయ’గా రీమేక్‌ చేశాం. దర్శకుడు చెప్పినట్టే చేశాను. నా వీడియో విడుదలవగానే నా ఇన్‌బాక్స్‌ మెసేజ్‌లతో నిండిపోయింది. వాలెంటైన్స్‌ డే రోజున డేట్‌కి వస్తావా అని అడుగుతున్నారు. చాలా మంది ప్రపోజ్‌ చేశారు కూడా.’‘ఇప్పటివరకు ఇంకా ఎవ్వర్నీ ప్రేమించలేదు. ప్రస్తుతం నా కళ్లముందు చదువు, నటిగా గుర్తింపు తెచ్చుకోవాలన్న లక్ష్యాలే ఉన్నాయి. చెప్పాలంటే వ్యాలెంటైన్స్‌ డే రోజు కూడా కాలేజ్‌కి వెళ్తున్నా. ఎందుకంటే హాజరు సమస్య ఉంది. నాది అమ్మాయిల కాలేజ్‌ కాబట్టి అబ్బాయిలతో సమస్యలు వస్తాయన్న బాధ ఉండదు.’ అని చెప్పుకొచ్చింది ప్రియ.


‘ఒరు అదర్‌ లవ్‌’ చిత్రంలో ప్రియది చిన్న పాత్రే. కానీ ఆమెకు ఇంత పాపులారిటీ రావడంతో కథానాయికగా ఎంపికచేశారు. ఇందులో ఆమె పాత్ర పేరు కూడా ప్రియనే కావడం విశేషం. ఒమర్‌ లులు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మార్చి 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందకు రానుంది. కాగా..ప్రియ.. కథానాయకుడు రోషన్‌ అబ్దుల్‌ రహూఫ్‌, దర్శకుడు ఒమర్‌లతో కలిసి దిగిన సెల్ఫీను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.


ప్రియ..కేరళలోని త్రిస్సూర్‌ జిల్లాలో పుట్టింది. త్రిస్సూర్‌లోని విమల మహిళల కళాశాలలో బీ.కామ్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. తండ్రి ప్రకాశ్‌ వారియర్‌, తల్లి ప్రీతా ప్రకాశ్‌ వారియర్‌. శాస్త్రీయ నృత్యం మోహినియాట్టంలోనూ ఆమె శిక్షణ తీసుకుంది. పాటలు కూడా బాగా పాడుతుంది. 2016లో వచ్చిన ‘యే దిల్ హై ముష్కిల్‌’ చిత్రంలోని ‘చన్నా మేరేయా..’ పాట పాడుతున్న వీడియోను ప్రియ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.
Recent Post