రైతులకు అండగా నిలిచిన హీరో కార్తీ..

  Written by : Suryaa Desk Updated: Sat, Sep 19, 2020, 02:32 PM

సినిమాల్లో మంచి మంచి పనులు చేస్తూ హీరోలుగా చెలామణి అయ్యేవారు...రియల్ లైఫ్ లో హీరోలుగా నిలిచేవారు కొందరే. లాక్ డౌన్ సమయంలో సినీనటుడు సోనూసూద్ రియల్ హీరోగా మారాడు. ఇప్పటికే దేశవ్యాప్తంగా సోనూసూద్ ప్రజల మన్నలను అందుకుంటున్నాడు. అలాంటి వారి జాబితాలో తమిళ హీరో సూర్య సోదరుడు హీరో కార్తీ చేరాడు. సినిమాల్లోనే కాకుండా నిత్య జీవితంలోనూ వారిద్దరూ ప్రజా సమస్యల మీద పోరాడుతుంటారు.
'అగరం' ఫౌండేషన్‌ ద్వారా పేద విద్యార్థులు ఎందరికో సూర్య విద్యాదానం చేస్తున్న విషయం తెలిసిందే. అనాథలను చేరదీయడం, వారికి విద్య, గుండెజబ్బులు ఉన్న పిల్లలకు ఆపరేషన్లు చేయించడం వంటి ఎన్నో పనులు చేస్తున్నారు సూర్య. అంతేకాదు ఇటీవలే సూర్య కరోనా వల్ల నష్టపోయిన సినీ కార్మికులకు రూ.2 కోట్లు ఆర్ధిక సహాయం అందించారు. సూర్య భార్య జ్యోతిక కూడా కరోనా కాలంలో తమిళనాడులోని ఓ ప్రభుత్వ ఆసుపత్రికి రూ.25 లక్షలు ఆర్ధిక సహాయం చేశారు.
అన్న వదినలకు తానేమీ తక్కువ కాదంటూ నిలిచాడు కార్తీ. ఉళవన్' అనే ఫౌండేషన్ నడుపుతున్న కార్తీ ఈ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే రైతుల కోసం ఎన్నో ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపట్టాడు. ఈ ఫౌండేషన్ ద్వారా కార్తీ తాజాగా 10వేల ఎకరాల భూమికి నీరు అందించాడు. రైతుల కోసం 'ఉళవన్' ఫౌండేషన్ ద్వారా తమిళనాడులోని ఉద్రపురం, తిరునెల్‌వెలి జిల్లాలోని సూరవల్లి కాలువను కార్తీ శుభ్రం చేయిస్తున్నాడు. రూ.4 లక్షల ఖర్చుతో 21 రోజుల క్రితం చేపట్టిన కాలువ పూడిక తీత పనులు త్వరలో పూర్తి కానున్నాయి. ఈ కాలువలో పూడిక తీసి శుభ్రం చేయడం వల్ల చుట్టుపక్కల 10 గ్రామాల్లో దాదాపు 10వేల ఎకరాల భూమికి సాగునీరు అందనుంది. కార్తీ చేసిన మంచి పనికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రశంసలతో ముంచెత్తారు.
Recent Post