శనివారం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ పుట్టినరోజు. ఈ సందర్భంగా క్లాసిక్ మూవీ 'అంజలి' సినిమాలోని 'అంజలి అంజలి అంజలి' అనే పాటను రీ క్రియేట్ చేసి.. వీడియో సాంగ్ ను విడుదల చేశారు. మణిరత్నం దర్శకత్వంలో మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యం వహించిన 'అంజలి' సినిమాలో బేబీ షామిలి తన అభినయంతో అందరినీ కట్టిపడేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ ని ఇప్పుడు అల్లు అర్హతో మళ్లీ రీ క్రియేట్ చేయగా.. క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అల్లు అర్హ నటించి ఆకట్టుకుంటోంది. ఈ పాటలో అల్లు అర్హతో పాటు ఆమె సోదరుడు అల్లు అయాన్, తాతయ్యలు అల్లు అరవింద్, కేసీ శేఖర్ రెడ్డి సహా అల్లు అర్జున్ కూడా నటించడం విశేషం. నాటి క్లాసిక్ సాంగ్‌కు ధీటుగా ఈ పాటను కలర్ఫుల్గా రీ క్రియేట్ చేశారు. గణేశ్ స్వామి కొరియోగ్రఫీ చేసిన లేటెస్ట్ అంజలి వీడియో సాంగ్‌కు సూర్య సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేశారు. ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.