బిగ్ బాస్ షో పై నాగబాబు..ఆ ఇద్దరికీ ఓటెయ్యాలని రిక్వస్ట్

  Written by : Suryaa Desk Updated: Wed, Nov 25, 2020, 05:02 PM

తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్. ప్రస్తుతం మూడు సీజన్లు పూర్తి చేసుకుని నాలుగో సీజన్ జరుగుతుంది. ప్రస్తుతం ఈ షో ప్రేక్షకులకు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. క్షణం క్షణం ఏం జరుగుతుందో అన్న టెన్షన్ తో ఆద్యంతం విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం నాలుగో సీజన్ కూడా విజయవంతంగా నడుస్తోంది. అయితే బిగ్ బాస్ షోపై మెగాబ్రదర్ నాగబాబు స్పందించారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లు అవినాశ్, అభిజిత్ లపై తన అభిప్రాయాలు వెల్లడించారు.
అవినాశ్ తనకు చాలాకాలంగా తెలుసని, జబర్దస్త్ కార్యక్రమం ద్వారా అవినాశ్ తనకు ఎంతో సన్నిహితుడయ్యాడని నాగబాబు తెలిపారు. అయితే, బిగ్ బాస్ షోలో ఓసారి అవినాశ్ తీవ్ర భావోద్వేగాలకు గురికావడం గమనించానని, దాంతో అతడికి కొద్దిగా బ్యాడ్ నేమ్ వచ్చిందని అన్నారు. తనకు తెలిసినంత వరకు అవినాశ్ ఎమోషనల్ వ్యక్తి కాదని, బహుశా బిగ్ బాస్ షోలో పరిస్థితుల కారణంగా భావోద్వేగాలకు లోనై ఉంటాడని తెలిపారు. ఇక అభిజిత్ విషయానికి వస్తే ఎంతో నిరాడంబరమైన వ్యక్తి అని వెల్లడించారు.
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో నటించిన అభిజిత్ ను తాను ఒకట్రెండు సార్లు కలిశానని, మొదటిసారి కలిసినప్పుడే ఎంతో నచ్చాడని చెప్పుకొచ్చారు. ఎంతో మంచి కుర్రాడు అనిపించాడని, ఓ హీరోగా సక్సెస్ అయ్యుంటే బాగుండును అనిపించిందని, కానీ సినిమా కెరీర్ విషయం అటుంచితే బిగ్ బాస్ లో మాత్రం మంచి పేరు తెచ్చుకున్నాడని చెప్పారు. అవినాశ్ తనకు బాగా క్లోజ్ అవడం వల్ల అతడ్ని సపోర్ట్ చేయమని చెబుతున్నాను కానీ తన మనసంతా అభిజిత్ పైనే ఉందని, అతడికి కూడా తప్పకుండా మద్దతు ఇవ్వాలని అభిమానులను నాగబాబు కోరారు. అవినాశ్, అభిజిత్ లను ఫైనల్స్ కు తీసుకెళ్లాలని అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నానని, వారిద్దరిలో ఎవరు గెలిచినా తనకు సంతోషమేనని పేర్కొన్నారు.
Recent Post