ఆస్కార్ బరిలో 'జల్లికట్టు' మూవీ

  Written by : Suryaa Desk Updated: Wed, Nov 25, 2020, 05:34 PM

మలయాళ సూపర్ హిట్ చిత్రం 'జల్లికట్టు' ఆస్కార్స్ -2021 ఎంట్రీస్ లో చోటు సంపాదించింది. ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీ అకాడమీ అవార్డ్స్ లో ఇండియా నుంచి చోటు దక్కించుకున్న చిత్రంగా 'జల్లికట్టు' నిలిచింది. ఆస్కార్ ఎంట్రీకి దాదాపు 27 చిత్రాలు పోటీ పడ్డాయి. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్న జల్లికట్టు చిత్రం 93వ అకాడమీ అవార్డులకు ఎంపికైంది. జల్లికట్టు ఎంపిక అయినట్టు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, జ్యూరీ బోర్డు చైర్మన్ రాహుల్ రావైల్ తెలిపారు. సినిమా థీమ్, ప్రొడక్షన్ క్వాలిటీ, లిజో జోస్ ఫెల్లిస్సెరీ డైరెక్షన్‌పై ప్రశంసలు గుప్పించారు.
తమిళనాడులో వివాదాస్పద సంప్రదాయ బుల్ టేమింగ్ స్పోర్ట్ ఆధారంగా సాగే జల్లికట్టు చిత్రంలో ఆంటోనీ వర్గీస్‌, చెంబన్ వినోద్ జోస్‌, సబుమోన్ అబ్దుసమద్ కీలక పాత్రల్లో నటించారు. మనుషులు, జంతువుల మధ్య బావోద్వేగ పూరిత సన్నివేశాలను కండ్లకు కట్టినట్టు చూపించిన జల్లికట్టు భారతదేశం గర్వించదగ్గ చిత్రాల్లో ఒకటి. 2019 అక్టోబర్‌లో కేరళలో విడుదలైన ఈ జల్లికట్టును 2019 టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ మరియు 24 వ బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో కూడా ప్రదర్శించారు.
ఈ రెండు చోట్లా సినిమాకు చాలా ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాకు గాను పెల్లిస్సేరీ 50 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఉత్తమ దర్శకుడు ట్రోఫీని కూడా అందుకున్నారు. 2011లో ఆడమింటే మకాన్ అబూ తర్వాత గత దశాబ్దంలో ఆస్కార్ అవార్డులకు మన దేశం నుండి ఆస్కార్ కి నామినేట్ అయిన రెండవ మలయాళ చిత్రం జల్లికట్టు.
Recent Post