మీరు ఎక్సర్‌సైజ్‌ చేసినా చేయకపోయినా ఈ మూడూ పరిశీలించుకోండి : పూరీజగన్నాథ్‌

  Written by : Suryaa Desk Updated: Thu, May 13, 2021, 03:04 PM

ఓ మనిషి శారీరకంగా ధృడంగా లేకపోతే అతనిలో మానసిక స్థైర్యం ఎంత ఉన్నా అది వృథానే అవుతుందని ప్రముఖ దర్శకుడు పూరీజగన్నాథ్‌ అన్నారు. ఈ మధ్యకాలంలో మనం ఎవరి నోట విన్నా 'Being Strong' అనే పదాన్ని ఎక్కువగా వింటున్నాం. అయితే, బీయింగ్‌ స్ట్రాంగ్‌ అనే దానికి తనదైన శైలిలో నిర్వచనాన్ని ఇస్తూ తాజాగా ఆయన 'పూరీ మ్యూజింగ్స్‌' వేదికగా ఓ వీడియో రిలీజ్‌ చేశారు.  ''గివ్‌ అప్‌' అనేది ఎవరైనా చేస్తారు. ఏ పనినైనా మధ్యలో వదిలేసి పోవడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. వదిలేసి పోవడానికి మనం ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ, చివరిదాకా నిలబడటానికి ప్రయత్నం చేయాలి. నేర్చుకోవాలి. అయితే, శారీరకంగా నువ్వు ధృడంగా ఉండకపోతే.. నీకు ఎంత మానసిక స్థైర్యం ఉన్నా కూడా ఉపయోగం లేదు. 


అందుకే అందరం వర్కౌట్‌ చేయాలి. మీరు ఎక్సర్‌సైజ్‌ చేసినా చేయకపోయినా ఈ మూడూ ఒక్కసారి పరిశీలించుకోండి. 1.ఒక్క నిమిషంపాటు గోడకుర్చీ వేయగలుగుతున్నామా లేదా?, 2.కుర్చీలో నుంచి ఒంటి కాలుపై లేవగలుగుతున్నామా లేదా? 3.మఠం వేసుకుని కింద కూర్చునప్పుడు రెండు చేతులు నేలమీద పెట్టకుండా పైకి లేవగలుగుతున్నామా లేదా?.. ఈ మూడూ ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇవి మీరు చేయలేకపోతే వృద్ధాప్యంలో కర్రలు, గోడలు పట్టుకుని నడవాల్సి ఉంటుంది. ఫిట్‌గా ఉన్నప్పుడు మీరు ఏదైనా చెప్తేనే మీ పిల్లలు మాట వింటారు. నీ జ్ఞానాన్ని, తెలివితేటల్ని వాళ్లు అర్థం చేసుకుంటారు. వణుకుతూ, గోడపట్టుకుని నడుస్తూ మీరు ఏం చెప్పినా ఎవరూ వినరు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మీరు మాట్లాడడం ఆపేయండి. ఎందుకంటే దాని వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు' అని పూరీ వివరించారు.
Recent Post