దాసరి కుమారులు ప్రభు, అరుణ్ లపై జూబ్లీహిల్స్ పీఎస్ లో కేసు నమోదు

  Written by : Suryaa Desk Updated: Sat, Jul 31, 2021, 11:01 AM

ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు కుమారులపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అప్పు తీర్చమన్నందుకు చంపేస్తామంటూ హెచ్చరించడంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే, గుంటూరు జిల్లాకు చెందిన అట్లూరి సోమశేఖర్ రావు ఎల్లారెడ్డిగూడలో నివసిస్తున్నారు. దాసరితో ఆయన చాలా సన్నిహితంగా ఉండేవారు. దాసరి ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పుడు సోమశేఖరరావు వద్ద నుంచి రూ. 2.10 కోట్లు అప్పు తీసుకున్నారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో దాసరి మృతి చెందారు.


అనంతరం పెద్దల సమక్షంలో 2018 నవంబర్ 13న ఆయన కుమారులు దాసరి ప్రభు, అరుణ్ లు రూ. 2.10 కోట్లకు బదులు రూ. 1.15 కోట్లు చెల్లించేందుకు అంగీకరించారు. అయితే ఆ డబ్బును వారు ఇవ్వకపోవడంతో ఈ నెల 27న జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 46లోని దాసరి నివాసానికి సోమశేఖర్ రావు వెళ్లారు. డబ్బు చెల్లించాలని అడిగారు. దీంతో, ఇంకోసారి ఇంటికి వస్తే చంపేస్తామంటూ వారు ఆయనను హెచ్చరించారు. దీంతో, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ప్రభు, అరుణ్ లపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Recent Post