మహిళ ఆయన మీద చెప్పు విసిరింది.. ఇంత కంటే పరువు తక్కువ ఇంకేమైనా ఉందా : జొన్నవిత్తుల

  Written by : Suryaa Desk Updated: Sun, Aug 01, 2021, 11:18 AM

సుమారు 9 ఏళ్ల క్రితం మంచు విష్ణు హీరోగా నటించిన దేనికైనా రెడీ అనే సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైన తర్వాత ఇందులో ఉన్న కొన్ని సీన్స్ తమను కించపరిచేలా ఉన్నాయి అంటూ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన చాలా మంది నిరసనలకు దిగారు. మోహన్ బాబు అలాగే బ్రాహ్మణ సామాజిక వర్గాల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. అనూహ్యంగా ఈ గొడవలో ఎంట్రీ ఇచ్చిన గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు - మోహన్ బాబు మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే జరిగింది. తాజాగా ఈ వ్యవహారం గురించి జొన్నవిత్తుల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


అనేక సూపర్ హిట్ సాంగ్స్ లిరిక్స్ అందించిన జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు పెద్దగా వివాదాల జోలికి వెళ్ళరు. కానీ అనూహ్యంగా దేనికైనా రెడీ అనే సినిమాలో కొన్ని సీన్స్ బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసే విధంగా ఉన్నాయని ఆయన గళమెత్తారు. ఈ వ్యవహారంలో మోహన్ బాబు అభిమానులు - జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మధ్య దూరం పెరుగుతూ వెళ్ళింది. ఆ దూరం ఎంతవరకు వెళ్లిందంటే ఏకంగా జొన్నవిత్తుల మీద మోహన్ బాబు పరువునష్టం దావా వేసే వరకు వెళ్ళింది. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ పరిణామాలు అన్నిటి గురించి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు పంచుకున్నారు.


విషయం గురించి ఆయన స్పందిస్తూ తాను రాసిన ఒక పుస్తకాన్ని అచ్చు వేయించడానికి విజయవాడ వెళ్లానని పుస్తకం ప్రింటింగ్ సాయంత్రం వరకు పడుతుంది అని చెప్పడంతో అప్పటికే వివాదంలో ఉన్న ఈ సినిమా చూడాలని అనిపించింది అన్నారు. అలా విజయవాడలో 11 గంటల ఆటకు వెళ్లానని సినిమా చూడడం మొదలు పెట్టాక ఒకదానిని మించి ఒకటి అభ్యంతరకర సన్నివేశాలు వస్తూనే ఉన్నాయని అన్నారు. ఈ సినిమాలో ముందుగా చండీహోమం చేయించాలని బ్రాహ్మణుల దగ్గరికి వెళ్లి అడుగుతారని, ఇప్పుడు బిజీగా ఉన్నాము కష్టమని చెబితే వాళ్ళని బతిమిలాడడం ఏంటి డబ్బు పడేస్తే వాళ్లే తోక ఊపుకుంటూ వస్తారు అనే డైలాగు ఉంటుందని అది చాలా నీచమైన డైలాగ్ అని అన్నారు.


ఒక వేదపండితుడి ని తోక ఊపుకుంటూ వస్తాడు అంటూ సంబోధించడం తనకు ఏమాత్రం రుచించలేదు అని ఆయన అన్నారు.. సరే అది వదిలేస్తే ఒక బ్రాహ్మణ స్త్రీ మూర్తి ఏ మగాడు చూసినా మీరు మా ఆయన లాగే ఉన్నారు అంటూ డైలాగ్ అనేలా పెట్టడం అనేది చాలా నీచమైన పని అసలు ఆ పని ఎందుకు చేశారో ఇప్పటికీ అర్థం కాదని ఆయన అన్నారు. ఇవేకాక మరికొన్ని సీన్స్ కూడా ఉన్నాయని అవన్నీ చూసి తాను బాధ పడ్డాను అని అన్నారు. నిజానికి అప్పుడు తాను ఎవరిని వ్యతిరేకిస్తూ మాట్లాడలేదని ఒక టీవీ ఛానల్ డిబేట్ కి పిలిస్తే ఆ డిబేట్ కి హాజరయ్యానని అన్నారు. అందులో తన వ్యతిరేక పానల్ లో ఉన్న మోహన్ బాబు వర్గీయులు తనను టార్గెట్ చేశారని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ వ్యవహారం అంతా సద్దు మణిగిన రెండు నెలల సమయానికి తనకు పరువు నష్టం దావా అంటూ కొన్ని నోటీసులు వచ్చాయని ఇందులో నేనేం పరువునష్టం చేశానో నాకు అర్థం కాలేదని జొన్నవిత్తుల పేర్కొన్నారు. 
Recent Post