కెల్విన్ నాకు ఆ పార్టీ లోనే తెలుసు: ఈడీ విచారణలో ముమైత్‌ ఖాన్

  Written by : Suryaa Desk Updated: Thu, Sep 16, 2021, 05:42 PM

టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో ఈడీ చేపట్టిన దర్యాప్తు టెన్షన్ పుట్టిస్తోంది. ముఖ్యంగా డ్రగ్స్ కొనుగోళ్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపైనే ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఈడీ విచారణకు నిన్న ముమైత్ ఖాన్ హాజరయింది. దాదాపు 7 గంటలపాటు కొనసాగిన విచారణలో ముమైత్ కు ఈడీ అధికారులు పలు ప్రశ్నలను సంధించారు. ప్రధానంగా ఈ కేసులో కీలక నిందితులైన జీషాన్, కెల్విన్ లతో గల ఆర్థిక సంబంధాలపై ఆమెను ప్రశ్నించారు.


ఈడీ ప్రశ్నలకు బదులుగా ముమైత్ ఖాన్ స్పందిస్తూ... తన స్నేహితులతో కలిసి హైదరాబాదులో తాను కొన్ని పార్టీల్లో పాల్గొన్నానని, ఆ పార్టీల్లో డ్రగ్స్ వినియోగించలేదని తెలిపింది. కెల్విన్, జీషాన్ లు తనకు అక్కడే తెలుసని... అయితే, వారితో తనకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు లేవని ఆమె చెప్పింది. తన బ్యాంక్ స్టేట్మెంట్లను కూడా ఈడీ అధికారులకు ముమైత్ అందించింది.


మరోవైపు అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలపై ముమైత్ నుంచి ఈడీ అధికారులు వివరణ తీసుకున్నారు. హీరో నవదీప్ కు చెందిన ఎఫ్ క్లబ్ కు ముమైత్ ఖాతా నుంచి డబ్బు బదిలీ అయినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. వీటిపై ఈడీ అధికారులు ప్రశ్నించగా... అవి కేవలం పార్టీలకు సంబంధించిన లావాదేవీలేనని ముమైత్ సమాధానమిచ్చింది.
Recent Post