'మా' ఎన్నికలకు నోటిఫికేషన్‌

  Written by : Suryaa Desk Updated: Sat, Sep 18, 2021, 03:11 PM

తెలుగు చిత్రప్రముఖులతో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలకు నగారా మోగింది. వచ్చే నెల పదో తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ జూబ్లీ హిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో పోలింగ్‌ జరగనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఎన్నికల అధికారి వి. కృష్ణమోహన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేశారు.ఎనిమిది మంది ఆఫీస్‌ బేరర్స్‌, పద్దెనిమిది మంది ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్స్‌ కోసం జరిగే ఈ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు ఈ నెల 27 నుండి 29 వరకూ స్వీకరిస్తారు. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. వచ్చే నెల రెండో తేదీ వరకు నామినేషన్‌ ఉపసంహరణకు గడువు ఉంది. అక్టోబర్‌ 10న ఎన్నికలు, అదే రోజు రాత్రి ఏడు గంటలకు ఫలితాలు వెల్లడవుతాయి.


ఒక అభ్యర్ధి ఒక పదవి కోసమే పోటీ చేయాలనీ, గత కమిటీలో ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ అయి ఉండి, ఈసీ మీటింగ్స్‌కు 50 శాతం కన్నా తక్కువ హాజరీ ఉంటే ఈ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండదనీ, అలాగే 24 క్రాఫ్ట్స్‌లో ఆఫీస్‌ బేరర్స్‌గా ఉన్న వారు ఆ పదవులకు రాజీనామా చేయకుండా 'మా' ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదనీ ఎన్నికల నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.ఈసారి అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు, సి.వి.ఎల్‌.నరసింహారావు పోటీ పడుతున్నప్పటికీ పోటీ ప్రధానంగా ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణుల మధ్య ఉండవచ్చని అంటున్నారు.
Recent Post