రూ.200 కోట్ల మోసం కేసు.. ఈడీ అధికారుల విచారణ లో జాక్వెలిన్

  Written by : Suryaa Desk Updated: Sun, Sep 26, 2021, 02:43 PM

రూ.200 కోట్ల మోసం కేసుకు సంబంధించి బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను ఇవాళ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారించనున్నారు. ఈ కేసుకు సంబంధించి ఆమెను విచారించడం ఇది రెండోసారి. రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు శివీందర్ సింగ్, మల్వీందర్ సింగ్ కుటుంబాన్ని రూ.200 కోట్లకు మోసం చేసి.. ఆ మొత్తాన్ని మనీలాండరింగ్ ద్వారా దేశం దాటించాడన్న ఆరోపణలపై సుఖేశ్ చంద్రశేఖర్ అనే నిందితుడు ప్రస్తుతం రోహిణీ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.


అధికారుల విచారణలో భాగంగా సుఖేశ్ భార్య లీనా పాల్ ద్వారా జాక్వెలిన్ పరిచయం అయినట్టు అతడు చెప్పాడు. వారిద్దరి మధ్య ఫోన్, మెసేజ్ ల సంభాషణ జరిగినట్టు వెల్లడించాడు. ఈ క్రమంలోనే గత నెలలో జాక్వెలిన్ ను అధికారులు విచారించి ఆమె స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు. మళ్లీ ఆమెను విచారణకు పిలిచారు.  మోసం, దోపిడీకి పాల్పడ్డారని పేర్కొంటూ సుఖేశ్ పై ఢిల్లీ పోలీస్ ఆర్థిక నేరాల విభాగం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.


ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆగస్టు 24న చెన్నైలోని సుఖేశ్ కు చెందిన రూ.82.5 లక్షల విలువైన బంగళాను, డజను లగ్జరీ కార్లను సీజ్ చేశారు. కాగా, 17 ఏళ్ల నుంచే అతడు ఆర్థిక నేరాలకు బాగా అలవాటు పడ్డాడని అధికారులు తెలిపారు. అతడి మీద అప్పటికే చాలా ఎఫ్ఐఆర్ లు నమోదై ఉన్నాయని పేర్కొన్నారు.
Recent Post