ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'పుష్ప' 'సామీ సామీ' మాస్ ప్రోమో..!

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 25, 2021, 05:13 PM



స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా ''పుష్ప''. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. లారీ డ్రైవర్ పుష్ప రాజ్ అనే ఊర మాస్ పాత్రలో బన్నీ.. పల్లెటూరి అమ్మాయి శ్రీవల్లి గా రష్మిక కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ని ''పుష్ప: ది రైజ్'' పేరుతో డిసెంబర్ 17న రిలీజ్ చేయనున్నారు.


ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ చేస్తున్న 'పుష్ప' టీమ్.. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన 'దాక్కో దాక్కో మేక' సాంగ్.. దసరా సందర్భంగా వచ్చిన 'శ్రీవల్లి' పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో మూడో పాటను రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ''సామీ సామీ'' అనే పాటను అక్టోబర్ 28న ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సాంగ్ మాస్ ప్రోమోని ఐదు బాషల్లో రిలీజ్ చేశారు.


'నువ్వు అమ్మీ అమ్మీ అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్లున్నాదిరా సామీ.. నా సామీ.. సామీ సామీ అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కంగుంది సామీ.. నా సామీ..' అంటూ సాగిన ఈ పాట అలరిస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన రెండు సాంగ్స్ కు భిన్నంగా కాస్త ఫోక్ టచ్ తో ఈ పాట సాగింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన బాణీలకు గేయ రచయిత చంద్రబోస్ సాహిత్యం అందించారు. సింగర్ మౌనిక యాదవ్ హుషారుగా ఆలపించారు.


'సామీ సామీ' ప్రోమోని బట్టి ఇది పుష్పరాజ్ - శ్రీవల్లి మధ్య వచ్చే మంచి మాస్ బీట్ సాంగ్ అని అర్థం అవుతోంది. తెలుగు తమిళం మలయాళం కన్నడ భాషల్లో ఈ పాట అందుబాటులోకి రానుంది. మిరోస్లా కుబా బ్రోజెక్ వె చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ - ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ పై నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో ''పుష్ప'' సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com