యూట్యూబ్‌ ఛానళ్లకు మంచు విష్ణు హెచ్చరిక

  Written by : Suryaa Desk Updated: Mon, Oct 25, 2021, 05:56 PM

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా)లో మహిళల భద్రత, సాధికారతను పెంపొందించేందుకు తాజా 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మంచు విష్ణు తన తొలి నిర్ణయంగా 'మా' మహిళల భద్రతకు ముందడుగా వేశారు. వారి భద్రత కోసం ప్రత్యేకంగా విమెన్‌ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ గ్రీవెన్స్‌ సెల్‌(WEGC)ను ఏర్పాటు చేస్తున్నామని, మహిళల సాధికారిత కోసం ఈ కమిటీ పనిచేస్తుందని విష్ణు తన ట్విటర్‌లో పేర్కొన్నారు.


ఇక ఈ విషయం సోషల్‌ మీడియాలో ప్రకటించిన అనంతరం మంచు విష్ణు పలు యూట్యూబ్‌ ఛానళ్లుపై మండిపడ్డారు. తెలుగు ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న విష్ణు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నటీమణులు, హీరోయిన్లపై అభ్యంతరకర వీడియోలు పెడితే ఉపెక్షించేది లేదని హెచ్చిరించారు. కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు నటుల పట్ల దారుణంగా ప్రవరిస్తున్నాయని, అసభ్యకర రీతిలో వారిపై రూమర్లు క్రియేట్‌ చేస్తు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయన్నారు. అలాంటి ఛానళ్లపై చర్యలు తప్పవన్నారు.


ఇక యూట్యూబ్‌ ఛానళ్లలో థంబ్‌నైల్స్‌ హద్దులు మీరుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నటీమణులు మన ఆడపడుచులని, వారిని గౌరవించాలని విష్ణు విజ్ఞప్తి చేశారు. అలాగే హీరోయిన్లపై అభ్యంతరకర వీడియోలు పెడితే ఉపేక్షించబోమన్నారు. ఈ సందర్భంగా యూట్యూబ్‌ ఛానళ్ల నియంత్రణకు ప్రత్యేక లీగల్‌ సెల్‌ ఏర్పాటు చేస్తున్నట్టు విష్ణు తెలిపారు. పరిధి దాటే ఇలాంటి యూట్యూబ్‌ ఛానళ్లని నియంత్రించడం తన ఎజెండాలో ఓ అంశమని ఆయన పేర్కొన్నారు. తెలుగు మీడియా ఎప్పుడూ హద్దులు దాటలేదని, తన కుటుంబానికి, చిత్ర పరిశ్రమకి సహకారం అందిస్తూనే ఉందని మంచు విష్ణు పేర్కొన్నారు.
Recent Post